ఎన్నికల ఫలితాలే కేసీఆర్‌కు సమాధానం

రానున్న లోకసభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వమే ఏర్పడుతుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలే కేసీఆర్‌కు సమాధానమని పేర్కొన్నారు. 
 
 తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అనే తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టు కోల్పోయిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ పథకాలు అట్టర్ ప్లాప్ అయ్యాయని విమర్శించారు. ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని చెబుతూ  రాబోవు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ దుంధుబీ మోగిస్తుందని బీజేపీ నేత ధీమా వ్యక్తం చేశారు.
 
మోదీ నాయకత్వంలో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని చెబుతూ  బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ప్రచారం చేశారని అంటూ ఆమె కేసీఆర్ ను ఎద్దేవా చేశారు.  మోదీ చేసిన అభివృద్ధే బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చిందని ఆమె  చెప్పుకొచ్చారు. 
 
కేంద్రం సహకారంతోనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని ఆమె తెలిపారు. 30 సంవత్సరాల తరువాత వరుసగా రెండవ సారి తిరిగి ఒకే పార్టీ యూపీలో అధికారంలోకి వచ్చిందని డీకే అరుణ పేర్కొన్నారు.
 
రాజాసింగ్ పై కేసు కొట్టివేత 
 
 కాగా, బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్‌పైన వేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్‌ పైన ఉన్న కేసులను దాచి పెట్టారని అప్పట్లో టీఆర్ఎస్ తరుఫున గోశామహాల్ నుంచి పోటీ చేసిన ప్రేమ్ సింగ్ రాథోడ్ కేసు వేశారు. 51 కేసులు ఉంటే అఫిడవిట్‌లో 47 కేసులే చూపెట్టారని ఫిర్యాదులో రాథోడ్ పేర్కొన్నారు. ఆ నాలుగు కేసులు తన దృష్టిలో లేవని రాజాసింగ్ న్యాయస్థానానికి వివరించారు. దీంతో హైకోర్టు కేసును కొట్టివేసింది.