ఎపిలో హంద్రీ-నీవా పనులకు తెలంగాణ అభ్యంతరం 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు గురువారం మరో లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో హంద్రీనీవా సుజల స్రవంతి పథకం విస్తరణ పనులు చేపడుతోందని లేఖలో ఫిర్యాదు చేసింది. 
 
ఈ పనులు వెంటనే నిలిపివేయించాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ ద్వారా బోర్డు చైర్మన్‌నుకోరారు. కర్నూలు జిల్లాలోని హంద్రీనీవా పథకం ద్వారా నీటిని అధికంగా వాడుతున్నట్టు తెలిపారు. మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా చిన్ననీటి విభాగంలోని చెరువులకు నీటిని అందిస్తున్నామంటూ పదేపదే పనులు చేపడుతోందని ఆరోపించారు. 
 
ఎపి ప్రభుత్వం 195మైనర్ ఇరిగేషన్‌ట్యాంకులను కృష్ణాజలాలతో నింపేందుకు హంద్రీనీవా పథకాన్ని విస్తరించే పనులకు టెండర్లు పిలుస్తున్నట్టు తాము గుర్తించామని తెలిపారు. శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీనీవా పథకానికి 34టిఎంసీల మిగులు జలాలు మాత్రమే ఉపయోగించుకోవాల్సివుండగా, అంతకంటే ఎక్కవగానే వాడుకుంటున్నట్టు ఫిర్యాదు చేశారు. 
శ్రీశైలం నుంచి ఏపీ 34 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని తోడకుండా ఆపాలని ఇప్పటికే పలుమార్లు తాము బోర్డును కోరామని… అయినప్పటికీ చెన్నై తాగునీటి పథకం కోసం 15 టీఎంసీలను, మరో 19 టీఎంసీలను ఎస్‌ఆర్‌బీసీ ద్వారా తరలించుకుపోయిందని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
ఈ పరిస్థితుల్లో బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి కృష్ణా నీటిని కేసీ కెనాల్‌కు మళ్లించి హంద్రీ నీవా ఎస్కేప్‌ ఛానల్‌ ద్వారా తరలించే ఏపీ ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. ఇలా చేయటం ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకమని లేఖలో గుర్తు చేశారు.
దామాషా పద్దతిలో తుంగభద్రకు నీరు 
 
ఇలా ఉండగా, తుంగభద్ర నదిలో సహజనీటి ప్రవాహం లేనప్పుడు దామాషా పద్దతిలో నీటిని విడుదల చేయాలన్న కృష్ణా బోర్డు ప్రతిపాదనకు మూడు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. బుధవారం హైదరాబాద్‌లో కృష్ణా బోర్డు కార్యాలయంలో పిళ్ల్కె అధ్యక్షతన ఆర్డీఎస్‌పై ప్రత్యేక సమావేశం జరిగింది. 
 
ఈ సమావేశంలో డ్యామ్‌ నుంచి కేసీ కెనాల్‌కు 10, ఆర్డీఎస్‌కు 7 టీఎంసీల కోటా ఉన్నందున నదిలో సహజప్రవాహం లేనప్పుడు తుంగభద్ర నుంచి 10 :7 నిష్పత్తిలో దామాషా పద్ధతిలో ఆర్డీఎస్‌ వద్ద మూడు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయాలని సిఇ మురళీనాథ్‌రెడ్డి ప్రతిపాదించారు. 
 
దీనిని ఎపి, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలు అంగీకరించాయి. సుంకేశుల బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో తెలంగాణ సర్కారు నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతలను ఆపేయాలని ఈ సందర్బగా పిళ్లై ఆదేశించారు.