
కీలకమైన ఉత్తర ప్రదేశ్ తో పాటు నాలుగు రాష్ట్రాలలో బిజెపి విజయభేరి మ్రోగించింది. స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి అవారమైన స్పష్టమైన ఆధిక్యత లభించింది. గోవాలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలకు ఒక్క సీటు తక్కువగా సాధించినప్పటికీ స్వతంత్రులు, ప్రాంతీయ పార్టీల మద్దతులో అధికారాన్ని చేపట్టడానికి సిద్ధమవుతోంది.
గత రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 403 స్థానాలున్న యుపిలో భారతీయ జనతా పార్టీ మిత్ర పక్షాలతో కలుపుకొని 273 స్థానాల్లో విజయం సాధించి తిరిగి అధికారం చేపట్టడానికి సిద్ధమయింది.
మరో వైపు తిరిగి అధికారంలోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడిన సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గత ఎన్నికలతో పోలిస్తే తన స్థానాలను రెట్టింపు చేసుకోగలిగిందే తప్ప ఆధికారానికి ఆమడదూరంలోనే నిలిచింది. ఆ పార్టీకి 125 స్థానాలు మాత్రమే దక్కాయి.
ఇక ప్రియాంక గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం సాగించినప్పటికీ ఫలితాలు మాత్రం పూర్తి నిరాశనే మిగిల్చాయి. క్రితం సారికన్నా మరింత తగ్గి కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. మాజీ ముఖ్యమంత్రి మాయావతికి చెందిన బిఎస్‌పికి ఒక్క స్థానమే దక్కింది. ఈ సారి ఎన్నికల్లో ఆ పార్టీ ప్రచారం ప్రారంభం నుంచి కూడా ఎక్కడా పోటీలో కనిపించక పోవడం గమనార్హం.
దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్ మళ్లీ బిజెపి వశమైంది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఓటమి పాలయినా రాష్ట్రంలో రెండోసారి అధికారం చేపట్టడానికి అవసరమైన మెజారిటీని సాధించి బిజెపి చరిత్రను తిరగరాసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకే పార్టీ రెండు సార్లు అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి.
ఎంతో రాజకీయానుభవం ఉన్న హరీశ్ రావత్ నేతృత్వంలో బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించిన కమలనాథులు రాష్ట్రంలో కాషాయ జెండాను రెపరెపలాడించారు. మొత్తం 70 స్థానాలకు గాను ఆ పార్టీ 47 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ 19 చోట్ల గెలుపొందింది. ఇతరులకు 2 స్థానాలు దక్కాయి.
ఇక 60 స్థానాలున్న మణిపూర్‌లోను బిజెపి 32 స్థానాలు గెలుచుకొని మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయింది. కాంగ్రెస్‌కు కేవలం 5 సీట్లు దక్కగా, నాగా పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) 7, జెడి(యు) 6, ఇతరులు 10 చోట్ల విజయం సాధించారు.
ఇక 40 స్థానాలున్న గోవాలో బిజెపి సొంతంగా 20 స్థానాలు గెలుచుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు మరో ఒక స్థానం తక్కువయినప్పటికీ ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ఆ పార్టీకి మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. కాంగ్రెస్‌కు 12, ఆప్‌కు 3, టిఎంసికి 2 స్థానాలు దక్కాయి.
More Stories
జమ్ముకశ్మీర్‌లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
ఢిల్లీలో బిజెపి సునామి.. యాక్సిస్ మై ఇండియా అంచనా
2027లో చంద్రయాన్-4 మిషన్ ప్రయోగం