కుల ప్రాతిపదికన సాయుధ బలగాలను వేరు చేయలేం 

కుల ప్రాతిపదికన సాయుధ బలగాలను వేరు చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డిఎ)లో షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్‌ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విముఖత వ్యక్తం చేసింది.
 
 సుప్రీం కోర్టు ధర్మాసనం జస్టిస్‌ సంజరు కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎంఎం సుందర్‌లతో కూడిన ధర్మాసనం ఎన్‌డిఎలో మహిళల చేరిక అంశంపై వ్యవహరిస్తోందని, కుల ఆధారిత రిజర్వేషన్ల కోసం చేసిన అభ్యర్థనను తాము పరిష్కరించబోమని స్పష్టం చేసింది. 
ఎన్‌డిఎలో మహిళల చేరికకు సంబంధించిన కుష్‌ కల్రా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ధర్మాసనం పరిశీలిస్తోందని, ఇందులో కైలాస్‌ మోర్‌ అనే వ్యక్తి కుల ఆధారిత కోటా కోరుతూ జోక్య దరఖాస్తు (ఇంట్రవన్సన్‌ అప్లికేషన్‌)ను దాఖలు చేశారు. 
 
”ఇక్కడ ఉపాధి సూత్రాలను వర్తింపజేయలేం. సాయుధ దళాలు ఒక సజాతీయ యూనిట్‌. మీరు వాటిని కులం ఆధారంగా వేరు వేయలేరు” అని జస్టిస్‌ ఎస్‌కె కౌల్‌ తెలిపారు. ప్రస్తుతం లింగ (జండర్‌) సమస్యపై దష్టి సారించామని, ఇతర అంశాల్లోకి వెళ్లేందుకు విముఖత చూపుతున్నామని ధర్మాసనం పేర్కొంది. 
 
లింగ సమస్యలను మాత్రమే పరిష్కరించాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు సామాజిక విప్లవానికి సమయం పడుతుందని పేర్కొంది. సాయుధ దళాలల్లో మాజీ నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డిఎ) మహిళా క్యాడెట్‌లకు ఇండక్షన్‌, డిప్లరుమెంట్‌ సమస్యలను అధ్యయనం చేయడానికి సమయం అవసరమని కేంద్రం చెప్పడంతో ధర్మాసనం తదుపరి విచారణను జూలైకి వాయిదా వేసింది.
 
 2021 ఆగస్టులో ఎన్‌డిఎ నిర్వహించే ప్రవేశ పరీక్షలకు హాజరయ్యేందుకు మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రక్షణ మంత్రిత్వ శాఖ దరఖాస్తును దాఖలు చేసింది.