కోవావాక్స్‌ టీకాకు డీసీజీఐ అనుమ‌తి

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒకప్పుడు వేలల్లో నమోదైన కేసులు ఇప్పుడు వందల్లో, పదుల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. దీంతో కోవిడ్ కోసం వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రజలకు వ్యాక్సినేషన్ ను భారత ప్రభుత్వం ఉచితంగా అందించింది.  ముందు వృద్దులకు మాత్రమే ఇచ్చిన కరోనా వ్యాక్సిన్… ఆ తర్వాత యువతకు, టీనేజర్లకు కూడా ఇవ్వడం ప్రారంభించారు. 

తాజాగా 12 నుంచి 17 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు పిల్ల‌లకు కూడా వ్యాక్సినేష‌న్‌కు రంగం సిద్ధ‌మైంది. 12-17 ఏళ్ల వ‌య‌సు పిల్ల‌ల‌కు కోవావాక్స్‌ను వినియోగించేలా డీసీజీఐ బుధ‌వారం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు ఈ వ్యాక్సిన్ ఉత్ప‌త్తిదారు అయిన సీరం ఇన్ స్టిట్యూట్‌కు డీసీజీఐ అనుమ‌తి ఇచ్చింది. 

15 ఏళ్ల పైబ‌డ్డ పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్‌కు ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం.. అనుమతి ఇచ్చింది. రెండు కోట్లకు టీనేజర్లకు కూడా వ్యాక్సినేషన్ ఇప్పటికే పూర్తయ్యింది. అయితే 15 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌సు క‌లిగిన పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్‌కు మాత్రం ఎలాంటి ప్ర‌ణాళికను ప్ర‌క‌టించ‌లేదు. 

ఇప్పుడు కోవావాక్స్ ను 12-17 ఏళ్ల పిల్ల‌ల‌కు వినియోగించేందుకు డీసీజీఐ అనుమ‌తి ఇవ్వ‌డంతో ఈ గ్రూప్ వ‌య‌సు పిల్ల‌ల వ్యాక్సినేష‌న్‌పై త్వ‌ర‌లోనే కేంద్రం  ప్ర‌క‌ట‌న  చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.