భారతీయులను తరలించడంలో ‘ఆపరేషన్ గంగ’ విజయవంతం

దాడులతో రగులుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను, పౌరులను ఖాళీ చేయించి, సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంలో భారత్‌ వెనుకబడిపోయిందన్న విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ  తోసిపుచ్చారు. ఉక్రెయిన్‌ నుంచి భారతీయ పౌరులను ఖాళీ చేయించేందుకు తాము చేపట్టిన ‘ఆపరేషన్‌ గంగ’ బ్రహ్మాండంగా విజయవంతమైందని. స్పష్టం చేశారు. దీనివల్ల ప్రపంచ రంగంలో భారత్ ప్రభావం పెరుగుతోందని వివరించారు.

పూణేలోని సింబయోసిస్ యూనివర్శిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు, దాని ఆరోగ్యం ధామ్‌ను ప్రారంభిస్తూ మనం యుద్ధ మండలం నుంచి వేలాది మంది భారతీయులను ఆపరేషన్ గంగ ద్వారా సురక్షితంగా స్వదేశానికి తరలించామని తెలిపారు. ‘అనేక పెద్ద దేశాలు కూడా ఉక్రెయిన్‌ నుంచి తమ పౌరులను తరలించడానికి కష్టాలు పడ్డాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా పెరిగిన పలుకుబడితో మేం వేలాది మందిని సురక్షితంగా స్వదేశానికి తీసుకుని వచ్చాం’ అని ప్రధాని చెప్పారు.

యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఒకవేళ దేశం ఈ మాత్రం మారిందంటే ఆ క్రెడిట్ యువతదే’ అని స్పష్టం చేశారు. ఏ రంగాలలోనైతే దేశం నిలబడలేదని అనుకున్నామో ఆ రంగాల్లో గ్లోబల్ లీడర్‌గా దేశం ఎదుగుతోంది అని భరోసా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మొబైల్, ఎలక్ట్రానిక్ తయారీ, రక్షణ రంగాలను ఉదాహరించారు.

నేడు భారత్ రక్షణ  ఎగుమతిదారుగా మారిందని, మొబైల్ తయారీలో భారత్ రెండో స్థానానికి ఎదిగిందని ప్రధాని గుర్తు చేశారు. ఏడేళ్ల క్రిందట దేశంలో రెండే మోబైల్ తయారీ కంపెనీలు ఉండేవని, నేడు 200కు పైగా తయారీ కంపెనీలు ఉన్నాయని చెప్పారు.  సాఫ్ట్‌వేర్ పరిశ్రమ మొదలుకుని ఆరోగ్య రంగం, కృత్రిమ మేధ మొదులుకుని ఆటోమోబైల్స్, ఎలక్ట్రిక్ వాహనాల తదితరాల వరకు దేశం ఎదిగిందని ప్రధాని వివరించారు.

మన యువత ప్రతిభకు ‘స్టార్టప్ ఇండియా’, మేక్ ఇన్ ఇండియా’, ఆత్మనిర్భర్ భారత్’ వంటివి ప్రాతినిధ్యం వహిస్తున్నాయన్నారు. నేడు భారత్ కొత్తవి ఆవిష్కరిస్తోంది, ప్రపంచంలో తన ప్రభావాన్ని పెంచుకుంటోంది అని ప్రధాని తెలిపారు. స్టార్టప్ లలో భారత్ ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నదని గుర్తు చేస్తూ, యువత ఈ అవకాశాన్ని సూచించాలని మోదీ సూచించారు.

 రక్షణ రంగంలో కూడా ప్రపంచంలో అత్యధికంగా దిగుమతులు చేసుకొనే దేశంగా గుర్తింపు పొందిన భారత్ ఇప్పుడు రక్షణ పరికరాలను విదేశాలకు ఎగుమతి చేయగలుగుతున్నదని ప్రధాని చెప్పారు. నేడు దేశంలో నిర్మాణంలో ఉన్న రెండు పెద్ద రక్షణ కారిడార్లు దేశ రక్షణకు అవసరమైన భారీ ఆయుధాలను ఉత్పత్తి చేయనున్నామని మోదీ వెల్లడించారు. 

కరోనాకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ తయారీ సామర్థంను భారత్ చాటిందని తెలిపారు. స్థానిక సవాళ్లకు పరిష్కారాలు విశ్వవిద్యాలయాల నుంచి రావాలని ప్రధాని సూచించారు.