పాక్ పై గెలుపుతో ప్రపంచ కప్ కు భారత మహిళల ఆరంభం!

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఘన విజయంతో.. వరల్డ్‌క్‌పను భారత మహిళల జట్టు ఘనంగా ఆరంభించింది. పూజా వస్త్రాకర్‌ (67), స్నేహ్‌ రాణా (53 నాటౌట్‌) ఏడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్‌ 107 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది.
 ప్రపంచక్‌పలో దాయాదిపై విజయాల రికార్డును 11-0తో మెరుగుపరచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. పూజ, రాణాతోపాటు ఓపెనర్‌ స్మృతి మంధాన (52) అర్ధ శతకాలు నమోదు చేశారు. నిదా దర్‌, నస్రా సంధు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం ఛేదనలో స్పిన్నర్‌ రాజేశ్వరీ గైక్వాడ్‌ (4/31) తిప్పేయడంతో.. పాక్‌ 43 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. పూజ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచింది. ఛేదనలో గైక్వాడ్‌ దెబ్బకు పాక్‌ బ్యాటింగ్‌ పేకమేడను తలపించింది. జవేరియా (11)ను క్యాచవుట్‌ చేసిన రాజేశ్వరి, ఆ తర్వాత ఆలియా రియాజ్‌ (11), ఫాతిమా (17), సిద్ర నవాజ్‌ (12)ను అవుట్‌ చేసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీసింది. కెప్టెన్‌ బిస్మా మారుఫ్‌ 15 రన్స్‌ చేసింది.
 
భారత్‌ జట్టులో మంధాన (సి అండ్‌ బి) అమీన్‌ 52, షఫాలీ (బి) డయానా 0, దీప్తి శర్మ (బి) నస్రా 40, మిథాలీ (సి) డయానా (బి) నస్రా 9, హర్మన్‌ప్రీత్‌ (ఎల్బీ) నిదా 5, రిచా ఘోష్‌ (బి) నిదా 1, స్నేహ్‌ రాణా (నాటౌట్‌) 53, పూజా వస్త్రాకర్‌ (బి) ఫాతిమా 67, జులన్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 50 ఓవర్లలో 244/7.
ఆరు ప్రపంచ కప్ లలో ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్‌ అరుదైన ఘనతను దక్కించుకొంది. 2000లో తొలిసారి ప్రపంచకప్‌ బరిలో దిగిన మిథాలీ.. ఆ తర్వాత 2005, 2009, 2013, 2017, ఇప్పుడు 2022లో ఆడుతోంది. ఈ క్రమంలో ఆరుసార్లు ప్రపంచ కప్‌ ఆడిన సచిన్‌, జావెద్‌ మియాందాద్‌ తర్వాత మూడో క్రికెటర్‌గా మిథాలీ రికార్డుల పుటల్లోకి కెక్కింది.