జెలెన్‌స్కీతో నేరుగా మాట్లాడండి…పుతిన్‌కు మోదీ సూచన

ఉక్రెయిన్‌లోని ప్రస్తుత పరిస్థితి, ఉక్రెయిన్-రష్యాల మధ్య జరుగుతున్న శాంతి చర్చల పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ వాకబు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌,  ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీలతో సోమవారంనాడు ఫోన్లో ఆయన విడివిడిగా మాట్లాడారు. పుతిన్ తో  దాదాపు 50 నిమిషాల సేపు ఉభయులూ మాట్లాడుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
 
ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంలో చిక్కుకున్న భారత విద్యార్థులను సురక్షితంగా వెనక్కి పంపించేందుకు సహకరించాలని పుతిన్‌ను మోదీ ఈ సందర్భంగా కోరారు. ఉక్రెయిన్, రష్యా ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు కొనసాగిస్తూనే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో నేరుగా మాట్లాడాలని కూడా పుతిన్‌కు మోదీ సూచించినట్టు తెలుస్తోంది. 
 
సుమీతో పాటు ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో రష్యా ‘మానవతా క్యారిడార్లు’ తెరవడం, తాత్కాలిక కాల్పుల విరమణలు ప్రకటిస్తుండటంపై మోదీ అభినందనలు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా సుమీలోని భారతీయ విద్యార్థులను భారత్‌కు తరలించాల్సిన అవసరాన్ని కూడా ప్రధాని ఆయనకు వివరించారు. 
 
11 రోజుల క్రితం ఉక్రెయిన్‌లో సైనిక చర్య ప్రారంభమైన అనంతరం మోదీ-పుతిన్‌ల మధ్య ఫోను సంభాషణలు చోటుచేసుకోవడం ఇది మూడోసారి. అంతకు ముందు, భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపింది.
రష్యా సేనలను ఉక్రెయిన్ సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న విధానాన్ని మోదీ ప్రశంసించారని, ఉక్రెయిన్ ప్రజల తరపున నిలిచినందుకు గర్వకారణం అంటూ జెలెన్‌స్కీ పేర్కొన్నారు. సోమవారం నరేంద్రమోదీతో 35 నిమిషాల పాటు ఫోన్‌లో ఆయన మాట్లాడారు. అనంతరం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
 
‘‘రష్యా దురాక్రమణను ఉక్రెయిన్ ఎంత ధీటుగా ఎదుర్కొంటుందో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చెప్పాను. యుద్ధ సమయంలో తమ దేశ పౌరులకు చేసిన సహాయంపై భారత్ మమ్మల్ని ప్రశంసించింది. అలాగే శాంతి నెలకొల్పేందుకు హైలెవల్ చర్చలపై ఉక్రెయిన్‌ కమిట్మెంట్‌ను అభినందించారు” అని చెప్పారు. 
 
అట్లాగే, ఉక్రెయిన్ ప్రజలకు మద్దతు ఇచ్చి, వారి తరపున నిలబడినందుకు గర్వంగా ఉందని జెలెన్‌స్కీ ట్వీట్ చేశారు. ట్వీట్ చివర్లో ‘స్టాప్ రష్యా’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని చేర్చారు.

ఐసీజేలో విచారణకు రష్యా దూరం

రష్యా తమ దేశంపై చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) ఉక్రెయిన్ ఆశ్రయించడంతో గత నెలలో నమోదైన కేసుకు సంబంధించి ఈరోజు నెదర్లాండ్స్‌లోని ఐసీజే (పీస్ ప్యాలెస్)లో విచారణ జరుగుతోంది. అయితే, ఈ విచారణకు హాజరుకాకూడదని రష్యా నిర్ణయించింది. ఈ కేసుకు సంబంధించి కోర్టులో తమ దేశం తరఫున ప్రతినిధి ఉండబోరని రష్యా ప్రకటించింది. 
 
కేసు విచారణలో భాగంగా తమ దేశంపై రష్యా దాడి ఆపేలా తక్షణం ఆదేశాలివ్వాలని ఉక్రెయిన్ కోరుతోంది. ‘ప్రస్తుతం మేం పీస్ ప్యాలెస్‌లో ఉన్నాం. అక్కడ మా దేశంపై రష్యా బాంబులు, మిస్సైల్స్‌తో విరుచుకుపడుతోంది. లక్షలాది ఉక్రెయిన్ ప్రజలు ప్రమాదంలో ఉన్నారు. ఇప్పటికే మా దేశం నుంచి 15 లక్షల మందికిపైగా వలస వెళ్లారు’ అంటూ ఉక్రెయిన్ ప్రతినిధి ఐసీజేలో  ఆందోళన వ్యక్తం చేశారు. 
 
మరింతమంది నిరాశ్రయులయ్యారని, తమప్రజలకు వైద్య సేవలు కూడా అందించలేకపోతున్నామని తెలిపారు. రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి తమపై దాడి చేస్తోందని పేర్కొన్నారు. అయితే, తమకు ఈ చట్టాలపై గౌరవం ఉందని స్పష్టం చేశారు.