ఓ కొలిక్కి వస్తున్న భారతీయుల తరలింపు

ఉక్రెయిన్ యుద్ధ భూమిలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ఓ కొలిక్కి వచ్చింది. ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా ఇప్పటికే దాదాపు 18 వేల మందిని కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి చేర్చింది. ఇందుకోసం వాణిజ్య విమానాలతో పాటు భారత నావికాదళం రవాణా  విమానాలను సైతం వినియోగించడంతో పాటు తరలింపు ఆపరేషన్‌లో సమస్యలు రాకుండా ఉండేందుకు ఉక్రెయిన్ పొరుగు దేశాలకు నలుగురు కేంద్ర మంత్రులను పంపింది. 
 
ఉక్రెయిన్ సిటీల్లో ఉన్న భారత విద్యార్థులు, పౌరులు ఆ దేశ సరిహద్దుకు చేరుకుంటే.. అక్కడి నుంచి పక్కన ఉన్న స్లొవేకియా, హంగేరి, పోలాండ్, రొమేనియా దేశాల నుంచి ప్రత్యేక విమానాల్లో భారత్ కు చేరుస్తోంది. అయితే సరిహద్దులు దాటాక మన పౌరులకు వీసా సహా ఇతర సమస్యలు రాకుండా డాక్యుమెంటేషన్ సాఫీగా సాగేలా దగ్గరుండి కేంద్ర మంత్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఇలా హంగేరి వెళ్లిన కేంద్ర మంత్రి హర్‌‌దీప్‌ సింగ్ పూరీ ఇవాళ స్వదేశానికి తిరిగొచ్చారు. ఉక్రెయిన్ నుంచి హంగేరి రాజధాని బుడాపెస్ట్‌ చేరుకున్న భారతీయుల చివరి బ్యాచ్‌తో స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌‌ ద్వారా వెల్లడించారు.
 
బుడాపెస్ట్‌ నుంచి మన విద్యార్థుల చివరి బ్యాచ్‌తో ఢిల్లీ చేరుకోవడం సంతోషంగా ఉందంటూ కేంద్ర మంత్రి హర్‌‌దీప్‌ సింగ్ పూరీ ట్వీట్ చేశారు. హంగేరి నుంచి మొత్తంగా 6,711 మందిని భారత్‌కు తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. మన యువత స్వదేశానికి చేరుకోవడం ఎంతో ఉపశమనాన్ని ఇవ్వడంతో పాటు తనలో చాలా సంతోషాన్ని నింపిందన్నారాయన.
 
 విద్యార్థులందరిన్నీ స్వదేశానికి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని, త్వరలోనే విద్యార్థులంతా తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను కలుసుకుంటారని హర్దీప్ పురి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో నిలిచిపోయిన ప్రతి ఒక్క భారతీయ విద్యార్థిని వెనక్కి రప్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు.
సుమీ నగరంలో సుమారు 700 మంది విద్యార్థులు చిక్కుకున్న విషయంపై మాట్లాడుతూ, కొద్ది మంది మాత్రమే మిగిలారని, వారితోనూ, కంట్రోల్ రూమ్‌తోనూ సంప్రదింపులు సాగిస్తున్నామని, ప్రధాని నరేంద్ర మోదీ సైతం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరినీ వెనక్కి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నారని చెప్పారు.
ఇలా ఉండగా, ఉక్రెయిన్ దాడుల్లో గాయపడ్డ భారతీయ విద్యార్థి హర్జోత్ సింగ్ సురక్షితంగా ఉన్నాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం సీ–17లో ఉక్రెయిన్ నుంచి అతడు భారత్కు బయల్దేరాడు. ఇప్పుడు హర్జోత్ సేఫ్గా ఉన్నాడని.. త్వరలోనే అతడు తన కుటుంబీకులతో కలుస్తాడని కేంద్ర మంత్రి వీకే సింగ్ తెలిపారు. 
 
హర్జోత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఇకపోతే, రీసెంట్ గా కీవ్ నగరంలో జరిగిన కాల్పుల్లో 31 ఏళ్ల హర్జోత్ సింగ్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. సరిహద్దు దాటుతున్న క్రమంలో అతడు ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరిగాయి. దీంతో హర్జోత్కు తీవ్ర గాయాలయ్యాయి.