బిజెపి ఎమ్మెల్యేలను సభలో నుంచి ఎత్తుకెళ్లిన మార్షల్స్

బిజెపి ఎమ్మెల్యేలను సభలో నుంచి ఎత్తుకెళ్లిన మార్షల్స్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే, కొద్దీ నిముషాలలోనే  బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురిని సమావేశాలు పూర్తయ్యేవరకు సభ నుండి బహిష్కరించారు.  గవర్నర్ ప్రసంగం లేదంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. బడ్జెట్ ప్రతులను చింపేసారు.
దీంతో బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు బీజేపీ సభ్యులు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌ రావును సస్పెండ్ చేయాలంటూ శాసనసభ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రావు తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఇందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదం తెలిపారు. మొత్తం ముగ్గురు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. బీజేపీ ఎమ్మెల్యేలను సభ లో నుంచి మార్షల్స్ ఎత్తుకెళ్లారు.
 
అసెంబ్లీ నుంచి తమను సస్పెండ్ చేయడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నల్ల కండువాలు ధరించిన బీజేపీ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ గేటు మందు కూర్చొని ధర్నా చేపట్టారు.  సమావేశాలకు హాజరయ్యే ముందు గవర్నర్ ప్రసంగంపై చర్చించే  హక్కు సభ్యులకు ఉంటుందని స్పష్టం చేస్తూ నల్ల కండువాలతో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి, గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు.
40 – 50 ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయాలను సీఎం కేసీఆర్ తుంగలో తొక్కి.. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగానికే దిక్కు లేదని… ఎమ్మెల్యేలు ఎంత? అని ఈటల వాపోయారు. స్పీకర్ కుర్చీని అడ్డం పెట్టుకొని తాము మాట్లాడకుండా మైకులు కట్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. 
 
ఉమ్మడి రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా తాము కొద్ది మందిమే ఉన్న సమయంలో గంటల తరబడి మాట్లాడే అవకాశం కల్పించారని గుర్తు చేశారు. ఇప్పుడు తామున్నది ముగ్గురమే కావచ్చని కానీ రాబోయే రోజుల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని ఈటల భరోసా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే బయట పోరాడుతామని ఈటల స్పష్టం చేశారు. 
 
కేసీఆర్ ది హిట్లర్ పాలన అని ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజమెత్తారు. కేసీఆర్  తెలంగాణను అంధకారంలోకి నెట్టిండని విమర్శించారు. ఆర్థిక బలంతో అహంకారంతో వ్యవహరిస్తున్నాడని  మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించటం అన్యాయమని ధ్వజమెత్తారు. 
 
సంప్రదాయం ప్రకారం నిర్వహించకుండా ఒక మహిళ అని కూడా చూడకుండా గవర్నర్‌ను అవమానించారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో తమ గళాన్ని నొక్కివేయలని చూస్తున్నారని పేర్కొంటూ  ఇది బంగారు తెలంగాణ కాదని.. మత్తుల తెలంగాణ అయిందని రాజసింగ్ ఎద్దేవా చేశారు.