ఉక్రెయిన్ లో సైనికులుగా మారుతున్న పౌరులు

ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక దాడి నేపథ్యంలో పౌరులే సైనికులుగా మారారు. తమ దేశాన్ని రష్యా దాడి బారి నుంచి కాపాడుకునేందుకు ఉక్రెయిన్ యువతీ,యువకులు ముందుకు వచ్చి తుపాకులు చేతబట్టి కదనరంగంలో దూకారు. రష్యా దండయాత్రను తిప్పికొట్టడానికి ఉక్రెయిన్ యువతీయువకులు, నూతన వధూవరులు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. 
 
యువతులు సైతం తుపాకులు కాల్చడం నేర్చుకొని యుద్ధరంగంలోకి దిగారు. తుపాకులతో కాల్చడం, గ్రెనెడ్లు విసరడంలో ఉక్రెనియన్ పౌరులు శిక్షణ తీసుకున్నారు. ఉక్రెయిన్ పౌరులు పౌర రక్షణ దళాలుగా ఏర్పడి చెక్ పోస్టులు, వీధుల్లో ఉండి గస్తీ నిర్వహిస్తున్నారు. వాలంటీర్ సైనికులుగా మారిన ఉక్రెయిన్ పౌరులు తుపాకులతో నగరాల్లో పహరా కాస్తున్నారు.
రష్యా దాడి నేపథ్యంలో ఖార్కివ్ షూటింగ్ రేంజ్ లో కలాష్నికోవ్ రైఫిల్ తో కాల్పులు జరపడంలో శిక్షణ పొందారు. నూతన దంపతులు సైతం రెండు తుపాకులు చేతబట్టి ఉక్రెయిన్ రక్షణ కోసం తాము సైతం అంటూ ముందుకు వచ్చారు. పలువురు ఉక్రెనియన్ పౌరులు బాటిళ్లలో పెట్రోలు బాంబులు సిద్ధం చేసి రష్యా సైనికులపై దాడికి సమాయత్తమయ్యారు.
 
ప్రపంచంలోని యాదులకు పిలుపు 
మరోవంక, రష్యా యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా ఖండించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ బుధవారం పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచంలోని యూదులు గళమెత్తాలని కోరారు. మౌనంగా ఉండిపోవద్దని చెప్పారు. 
 
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మారణహోమం జరిగిన కీవ్ నగరంలోని బాబి యార్‌పై రష్యన్ వైమానిక దళాలు మంగళవారం పెద్ద ఎత్తున దాడి చేసిన నేపథ్యంలో జెలెన్‌స్కీ ఈ పిలుపునిచ్చారు.  జెలెన్‌స్కీ విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో, ‘‘ఏం జరుగుతోందో మీరు చూడటం లేదా? నాజీయిజం నిశ్శబ్దంగా పుట్టింది. కాబట్టి సామాన్య ప్రజల హత్యలపై బిగ్గరగా అరవండి’’ అని విజ్ఞప్తి చేశారు.
ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్, మరొక నగరం ఖార్కివ్‌లపై రష్యన్ దళాలు మంగళవారం విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కీవ్‌లోని బాబి యార్ జిల్లాలో ప్రధాన టెలివిజన్ టవర్‌పై రష్యా దళాలు బాంబులు కురిపించాయి. దీంతో ఐదుగురు మరణించారు, ఐదుగురు గాయపడ్డారు.
బాబి యార్‌లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మారణహోమం జరిగింది. 1941 సెప్టెంబరులో రెండు రోజులపాటు 30 వేల మందికి పైగా యూదులను నాజీ జర్మన్, ఉక్రెయిన్ అనుబంధ దళాలు హత్య చేశాయి. జర్మన్లు పాల్పడిన క్రూరమైన యుద్ధ నేరాల్లో ఇదొకటి.
కాగా,  ఇప్పటివరకు 6 వేల మంది రష్యన్లు హతమైనట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. మరో వైపు రష్యన్ సైనికుల మానసిక స్థైర్యం పడిపోతోందని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ప్రకటించారు.‘పరిణామాలు మారిపోతున్నాయి. వారి సైన్యంలో మానసిక ధైర్యం నింపేందుకు రష్యా దురాక్రమణ దారులు ప్రయత్నిస్తున్నారు’ అని తెలిపారు. 
 
అయితే, అది దిగజారిపోతోందని అనేక సార్లు రుజువవుతోందిని,  ఉక్రెయిన్‌తో ప్రత్యక్షంగా తలపడేందుకు శత్రువు భయపడుతోందని ఆయన చెప్పారు.  అందుకే ప్రశాంతంగా ఉండే నగరాలపై షెల్లింగ్ జరుపుతూ నేరాలకు పాల్పడుతోందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.