బిజెపిని తిరిగి అధికారంలోకి తేవడంకు పర్యటిస్తా… యడియూరప్ప  

కర్ణాటకలో అత్యంత ప్రజాదరణ గల నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప రాష్ట్రంలో బిజెపిని మరోసారి అధికారంలోకి తీసుకు రావడం కోసం రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టనున్నట్లు ప్రకటించారు. 
 ఆదివారం నాడు 79 ఏళ్లు నిండిన సీనియర్ బిజెపి నాయకుడు ప్రజల ఆశీస్సులు తమకు ఉన్నాయని, కాషాయ పార్టీబీజేపీకి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

“అధికారంలో లేనప్పటికీ, నా పుట్టినరోజు సందర్భంగా 2,000-3,000 మందికి పైగా ప్రజలు వచ్చి నన్ను ఆశీర్వదించారు.  వారి ప్రేమ,  నమ్మకానికి నేను రుణపడి ఉంటాను. అసెంబ్లీ సమావేశాల తర్వాత, నేను మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాను. బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి నా పరిమితికి మించి చేయవలసిన ప్రయత్నం చేస్తాను” అని తెలిపారు.

రాష్ట్రంలోని  ప్రజలు ఇప్పటికీ బీజేపీతోనే ఉన్నారని, కాంగ్రెస్ కపట నాటకానికి ప్రజలు మద్దతు ఇవ్వరని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరిగే  అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలన్నదే తన దృఢ సంకల్పం అని స్పష్టం చేశారు.  ప్రజల ఆకాంక్ష కూడా ఇదే అని చెప్పారు. 

 
“రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఆ దిశగా అందరం సమిష్టిగా కృషి చేస్తాం.. ప్రజలు తప్పకుండా మద్దతు ఇస్తారన్న నమ్మకం ఉంది. మమ్మల్ని ఆశీర్వదించండి”  అని విజ్ఞప్తి చేశారు. మార్చి 4 నుంచి 30 వరకు బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అతిపెద్ద పార్టీగా అవతరించి, 2019 జూలైలో కాంగ్రెస్-జేడీ (ఎస్) సంకీర్ణ ప్రభుత్వాన్ని పతనం చేయడం ద్వారా దానిని అధికారంలోకి తీసుకొచ్చిన యడ్యూరప్ప, గత ఏడాది జూలై 26న, ఆయన ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా అధికారం నుండి వైదొలిగారు.

ప్రతిష్టాత్మకమైన పదవి నుండి ఆయన నిష్క్రమించడానికి వయస్సు ప్రాథమిక కారకంగా చెప్పవచ్చు. ఎందుకంటే బిజెపిలో 75 ఏళ్లు పైబడిన వారిని పదవులకు దూరంగా ఉంచాలనే అలిఖిత నియమాన్ని అమలు చేస్తున్నారు. ఆయన విధేయుడిగా భావించే బసవరాజ్ బొమ్మి ఆయన స్థానంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

యడ్యూరప్ప పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు బొమ్మైతో పాటు సంఖ్యలో నాయకులు, శ్రేయోభిలాషులు, మద్దతుదారులలో వచ్చారు. 

 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోరాటాల ద్వారా ఎదిగిన నాయకుడు యడ్డ్యూరప్ప అని కొనియాడారు. ఆయన ఎల్లప్పుడూ రైతులు, పేద ప్రజల సంక్షేమం కోసం కృషిచేశారని చెబుతూ ఆయన మార్గదర్శంలో రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం బిజెపి కృషి చేస్తుందని చెప్పారు. ఇచ్చిన మాటను తప్పకుండా, ప్రజలకు హామీలు అన్నింటిని నెరవేర్చిన నాయకుడు యడ్డ్యూరప్ప అంటూ ప్రశంసించారు.