బెంగాల్ మునిసిపల్ ఎన్నికల్లో హింస… బంద్ కు బిజెపి పిలుపు 

పశ్చిమ బెంగాల్‌లోని 107 మునిసిపాలిటీలకు ఆదివారం జరిగిన ఎన్నికలలో హింసాకాండ, అకృత్యాల ఎద్దఎత్తున జరిగాయి.  సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 76.51 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. 108 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగవలసి ఉండగా,  కూచ్‌బెహార్ జిల్లాలోని దిన్‌హటాలో టిఎంసి పోటీ లేకుండా ఒక పౌర సంస్థను గెలుచుకోవడంతో, ఆదివారం 107 పట్టణాల్లో ఎన్నికలు నిర్వహించారు.

ఎన్నికల ప్రక్రియను “ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం”గా అభివర్ణించిన ప్రతిపక్ష బిజెపి హింసను నిరసిస్తూ సోమవారం 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. టిఎంసి ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా పేర్కొంటూ, ప్రతిపక్ష పార్టీలు ఓటమిని గ్రహించి సాకులు వెతకడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. 
 
బంద్ సందర్భంగా బాలూర్‌ఘాట్‌లో పోలీసు సిబ్బందితో బిజెపి కార్యకర్తలు ఘర్షణకు దిగారు. అందుకు పోలీసులే కారణమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఆరోపించారు. “మా కార్యకర్తలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారిని కొట్టారు.  పోలీసులు టిఎంసి  క్యాడర్ పాత్ర పోషిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం’’ అని విమర్శించారు.
బీజేపీ కార్యకర్తలు కొన్ని ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లు, రోడ్లను దిగ్బంధించారు. హుగ్లీ స్టేషన్‌లోని రైలు పట్టాలపై కూర్చున్నారు. గత ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీకి సువేందు అధికారి సవాల్ విసిరిన పుర్బా మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్ నియోజకవర్గంలో రోడ్లను దిగ్బంధించారు. బంద్‌కు ఉత్తర బెంగాల్‌లో మంచి స్పందన లభించింది.  దుకాణాలు మూసివేశారు.  

ఆదివారం, సాయంత్రం 5 గంటల వరకు, 95.6 లక్షల మంది ఓటర్లలో 76.51 శాతం మంది తమ ఓటు హక్కును 2,000 కంటే ఎక్కువ వార్డుల్లో పటిష్టమైన భద్రత, మార్గదర్శకాలకు కట్టుబడి వినియోగించుకున్నారు.
“చెదురుమదురు హింసాత్మక సంఘటనల జరిగిన్నట్లు నివేదికలు వచ్చాయి. కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. మేము కొన్ని ప్రాంతాల్లో అవాంతరాలను గుర్తించాము.  చర్యలు తీసుకున్నాము” అని  రాష్ట్ర ఎన్నికల కమీషన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

మరణాలు, కాల్పులు జరిగినట్లు ఎలాంటి నివేదికలు రాకపోవడంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని పశ్చిమ బెంగాల్ డీజీపీ మనోజ్ మాలవ్య తెలిపారు. కొన్ని విచ్చలవిడి సంఘటనలు జరిగాయని,  హింసాత్మక ఘటనలన్నింటిలోనూ పోలీసులు చర్యలు తీసుకున్నారని తెలిపారు.

అయితే, గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అత్యంత విస్తృతమైన ఎన్నికల కసరత్తులలో ఉత్తరం నుండి దక్షిణం వరకు బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల నుండి విస్తృతమైన హింస, రిగ్గింగ్ సంఘటనలు, పోలీసులతో ఘర్షణలు జరిగిన్నట్లు వార్తలు వచ్చాయి .

“ఈరోజు జరిగింది పోలింగ్ కాదు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం. ప్రతి దక్షిణాది నుండి ఉత్తర బెంగాల్ మునిసిపాలిటీలో అధికార పార్టీ దుర్మార్గులు ఎన్నికలను ఒక ప్రహసనంగా మార్చారు. దీనికి నిరసనగా సోమవారం, మేము 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చాము” అని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య తెలిపారు.

పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంఖర్ సోమవారం ఉదయం పరిస్థితిని వివరించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సౌరవ్ దాస్‌ను పిలిపించారు.

ఉత్తర బెంగాల్‌లోని నార్త్ దినాజ్‌పూర్ జిల్లాలోని దల్‌ఖోలాలో ఆ ప్రాంతంలో టిఎంసి మద్దతుదారులు రిగ్గింగ్ చేశారనే ఆరోపణలపై కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో ఘర్షణకు దిగారు. వారు రోడ్లను దిగ్బంధించారు. పోలీసు అధికారులపై రాళ్లు రువ్వారు, ఆ తర్వాత గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.

ముర్షిదాబాద్ జిల్లాలోని ధులియన్ మునిసిపాలిటీ ప్రాంతంలో టిఎంసి కార్యకర్తలు ఆరోపించిన దుష్ప్రవర్తనలను పోలీసులు ఆపడానికి ప్రయత్నించిన తర్వాత హింస, ఘర్షణలు జరిగాయి. పార్టీ కార్యకర్తలు పోలీసులపై రాళ్లు, ఇటుకలతో విరుచుకుపడ్డారు.  ఆ తర్వాత గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి,  టియర్ గ్యాస్ షెల్ కాల్పులు జరిపారు.

నార్త్ 24 పరగణాస్‌లోని భాట్‌పరా మునిసిపాలిటీలో, బిజెపి ఎంపి అర్జున్ సింగ్ పాకెట్ బరో, టిఎంసి, బిజెపి మద్దతుదారుల మధ్య చెదురుమదురు ఘర్షణలు చెలరేగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఒక వార్డులో టిఎంసి సభ్యులు రిగ్గింగ్ చేశారని ఆరోపిస్తూ బిజెపి అభ్యర్థి ఈవీఎంను ధ్వంసం చేశారు.నార్త్ 24 పరగణాస్ జిల్లాలో, కమర్హతి ప్రాంతంలో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేందుకు బైక్‌పై వచ్చిన దుండగులు ఆ ప్రాంతంలో బాంబులు విసిరారని ఆరోపించడంతో ఇబ్బందులు తలెత్తాయి. ఆగ్రహించిన స్థానికులు ప్రతీకారం తీర్చుకుని కొందరు దుండగులను కొట్టి, కొన్ని వాహనాలను ధ్వంసం చేశారు.

రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో, టిఎంసిలో అంతర్గత పోరు, అధికారిక టిఎంసి అభ్యర్థుల కార్యకర్తలు టిక్కెట్లు నిరాకరించిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వతంత్రుల మద్దతుదారులతో ఘర్షణ పడ్డారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈవీఎంలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు.

ముర్షిదాబాద్ జిల్లాలో, లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధిర్ చౌదరి, కాంగ్రెస్, వామపక్ష అభ్యర్థులను కొట్టిన నివేదికలు మీడియాలో రావడంతో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పరుగెత్తడం కనిపించింది.

బహరంపూర్ మున్సిపాలిటీలో, చౌదరి తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పోలింగ్ ఏజెంట్లను బెదిరిస్తూ, ఓటర్లను ప్రభావితం చేస్తూ బూత్ నుండి బూత్‌కు తిరుగుతున్నాడని ఆరోపిస్తూ టిఎంసి కార్యకర్తలు కారు ముందు ఆందోళనకు దిగారు. చౌదరి ఆరోపణలు నిరాధారమైనవిగా పేర్కొన్నారు.

రాజ్‌పూర్-సోనార్‌పూర్ మునిసిపాలిటీలో, ఒక పోలింగ్ స్టేషన్‌ను గుర్తు తెలియని గూండాలు ధ్వంసం చేశారు మరియు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ధ్వంసం చేశారు. నార్త్ 24 పరగణాస్‌లోని వివిధ మునిసిపల్ ప్రాంతాలలో మోటార్‌సైకిల్‌పై రాజకీయ కార్యకర్తలు వీధుల్లో తిరుగుతూ ఓటర్లను పోలింగ్ బూత్‌లకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

అనేక మంది రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు, కెమెరాపర్సన్‌లను కొట్టడంతో పౌర ఎన్నికలను కవర్ చేస్తున్న మీడియా సిబ్బందిని కూడా విడిచిపెట్టలేదు. కొంతమంది జర్నలిస్టులు ఆసుపత్రి పాలయ్యారు.

హుగ్లీ జిల్లాలోని ఆరంబాగ్ ప్రాంతంలో, లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థులను టిఎంసికి అనుబంధంగా ఉన్న గూండాలు కొట్టారని ఆరోపణలు వచ్చాయి, దీనిని అధికార పార్టీ తిరస్కరించింది. రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో, బీజేపీ కోల్‌కతా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ లాల్‌బజార్‌కు మార్చ్ నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ  ఎన్నికల కమీషన్ కార్యాలయం వెలుపల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దహనం చేసింది.

విస్తృతమైన హింసాత్మక ఆరోపణలపై టిఎంసి  సెక్రటరీ జనరల్ పార్థ ఛటర్జీ స్పందిస్తూ, “ప్రతిపక్ష పార్టీలకు పోలింగ్ ఏజెంట్లు లేకుంటే, మమ్మల్ని నిందించలేరు. నేటి ఎన్నికల హింసకు ప్రతిపక్షాన్ని నిందించాలి. బిజెపి అల్లర్లను ప్రేరేపించడం కోసమే బంద్‌కు పిలుపునిచ్చింది” అంటూ ఆరోపించారు.

మునిసిపల్ ఎ న్నికలను ప్రహసనంగా అభివర్ణించిన సీపీఎం  సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.  మార్చి 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.