రష్యా- ఉక్రెయిన్ ఘర్షణతో పెట్రోల్ ధరలపై పెనుభారం

రష్యా-ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణ ఉద్రిక్తతల ప్రభావం… అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలపై పడింది. 2014 తర్వాత మొదటిసారిగా అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ 100 డాలర్లకు మించి,  105 డాలర్లను దాటుకొని పెరిగింది. 

శ్రీలంకలోని చమురు సంస్థలు పెట్రోల్‌పై రూ.20, డీజిల్‌ రూ.15లను ఒక్కసారిగా పెంచేశాయి. దీంతో అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 204 కు చేరగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ. 139కి పెరిగింది. ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. యుద్ధం ప్రారంభమైన రోజునే దీని ప్రభావం ముడి చమురు ఎగుమతులపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.

ఇదిలావుండగా శుక్రవారం చమురు ధరలు తగ్గాయని ‘రాయిటర్’ వార్తా సంస్థ తెలిపింది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్లుటిఐ) చమురు ధర 1.22 డాలర్లు లేక 1.3 శాతం తగ్గి బ్యారెల్ ధర 91.59 వద్ద స్థిరపడింది. ఇది అంతకు మునుపు సెషన్‌లో అత్యధికంగా 95.64 డాలర్లను తాకింది. ఇక ఈ వారం బ్రెంట్ ధర దాదాపు 4.7 శాతం పెరిగింది. 

కాగా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ కూడా దాదాపు 0.6 శాతం పెరిగే దిశ(ట్రాక్)లో ఉంది. ఫిబ్రవరి 24న రష్యా, ఉక్రెయిన్‌పై దాడిచేయడంతో 2014 తర్వాత మొదటిసారి బ్యారెల్ ధర 100 డాలర్లు దాటింది. బ్రెంట్ ధర 105 డాలర్లు దాటిందని ‘రాయిటర్స్’ వార్తా సంస్థ తెలిపింది.

భారత్ లో 114 రోజులుగా(అంటే 2021 నవంబర్ 4 నుంచి) మారని పెట్రోల్, డీజిల్ ధరలు రష్యా-ఉక్రెయిన్ ఘర్షణ కారణంగా భారీగా పెరుగొచ్చని కూడా భావిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగానే పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 

కాగా, స్థిరమైన ధరల్లోనే సరఫరా ఉండేందుకు ప్రపంచ ఇంధన మార్కెట్లను, సరఫరా అవాంతరాలను నిశితంగా గమనిస్తున్నామని భారత ప్రభుత్వం శనివారం తెలిపింది. “స్థిరమైన ధరల్లోనే సరఫరా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటాం” అని పెట్రోలియం మంత్రిత్వశాఖ ఓ ప్రకటనను జారీచేసింది. మార్కెట్‌లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులను నివారించేందుకు వ్యూహాత్మక నిల్వల నుంచి చమురును విడుదలచేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది.