ఎల్ఐసీ‌లో 20 శాతం ఎఫ్‌డీఐలకు కేంద్రం

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో ‘ఆటోమాటక్ రూట్’ కింద 20 శాతం వరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతించే సవరణకు కేంద్ర ప్రభుత్వం శనివారంనాడు ఆమోదం తెలిపింది. ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు వెళ్లనుందనే అంచనాల నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
 
 2022 ఆర్థిక సంవత్సరంలో రూ,78,000 కోట్ల మేరకు పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని కేంద్రం ఇప్పటికే నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత షేర్ల అమ్మకాల ద్వారా రూ.63,000-66,000 కోట్లు సేకరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 
 
కాగా, ఐపీఓ ధరను ఎల్ఐసీ ఇప్పటి వరకూ ప్రకటించనప్పటికీ, మార్కెట్ అంచనాల ప్రకారం ఐపీఓ ఒక్కో షేర్ రూ.2,000 నుంచి 2,100 వరకూ ఉండవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతమున్న ఎఫ్‌డీఐ పాలసీ ప్రకారం ఎల్ఐసీలో విదేశీ పెట్టుబడులకు సంబంధించిన ఎలాంటి ప్రత్యేక ప్రొవిజన్ లేదు.
కేంద్ర ప్రభుత్వం గత ఏడాది బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచినప్పటికీ, ప్రత్యేకమైన చట్టం (ఎల్‌ఐసీ యాక్ట్, 1956) కింద ఎల్ఐ‌సీకి ఇది వర్తించలేదు. ప్రస్తుతమున్న ఎఫ్‌డీఐ పాలసీ ప్రకారం, పబ్లిక్ సెక్టార్‌ బ్యాంకుల్లో పబ్లిక్ అప్రూవల్ రూట్ కింద ఎఫ్‌డీఐ సీలింగ్ 20 శాతం ఉంది.

ఆయుష్మాన్ భారత్‌ డిజిటల్ మిషన్‌

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎమ్)కు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశమైన కేంద్ర క్యాబినేట్ ఏబీడీఎమ్ స్కీమ్‌ను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.
 
ఈ పథకం కోసం వచ్చే ఐదేళ్లలో గాను, 1,600 కోట్లు కేటాయించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఈ పథకాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్ఏ) అమలు చేస్తుంది. ఈ పథకం కింద పౌరులు ‘ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఏబీహెచ్ఏ)’ ఓపెన్ చేసుకోవచ్చు.
హెల్త్‌కు సంబంధించిన రికార్డులను డిజిటల్‌గా నమోదు చేసుకోవచ్చు. ఈ రికార్డులు వైద్య రంగంలో సేవలందించే వారికి ఉపయోగపడతాయి. డిజిటల్ టెక్నాలజీని వాడుకోవడం ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు పొందే వీలవుతుందనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 17 కోట్లకు పైగా అకౌంట్స్ ఓపెన్ అయ్యాయని కేంద్రం ప్రకటించింది.