80:20 ఫార్ములాతో యుపిలో 80 శాతం సీట్లు గెలుస్తాం

యూపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీతో తమకు పొత్తు లేదని, ఒంటరిగానే పోటీ చేస్తున్నామని, ఈ ఎన్నికల్లో 80:20 ఫార్ములా 80 శాతం సీట్లు కచ్చితంగా గెలిచి తీరుతామని ఆ రాష్ట్ర సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ భరోసా వ్యక్తం చేశారు.  ఆంధ్రప్రభ-ఇండియా ఎ హెడ్‌ జాతీయ ఆంగ్ల న్యూస్‌ ఛానెల్‌తో మాట్లాడారు.

ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ భూపేంద్ర చౌబేతో పాటు పొలిటికల్‌ ఎడిటర్‌ అదితీ అనంతనారాయణ చేసిన ఇంటర్వ్యూలో బీజేపీ పాలనలో కులం, భాష, మతం, వర్గం ప్రాతిపదికన పాలన జరగలేదని స్పష్టం చేశారు. ముఖం చూసి కరోనా కాలంలో రేషన్‌ బియ్యం ఉచితంగా ఇవ్వలేదన్న యోగీ  బీఎస్‌పీ, ఎస్‌పీ హయాంలో ఇవన్నీ జరిగాయని ఆరోపించారు.

లోక్‌సభ ఎన్నికల్లోనూ 80 శాతం సీట్లు సాధించామని గుర్తు చేశారు. 2016లో దేశంలోనే అత్యంత అసమర్థ సీఎంగా అఖిలేష్‌ పేరు ప్రఖ్యాతులు సంపాధించుకున్నారని ధ్వజమెత్తారు. భద్రత విషయంలో రాజీపడలేదన్న యోగీ.. నేరాల సంఖ్యను రాష్ట్రాలతో పోల్చొద్దన్నారు. బీఎస్‌పీ, ఎస్‌పీతో బీజేపీ పాలనను పోల్చితే బాగుంటుందని చెబుతూ 2017 తరువాత ఒక్క ఆకలి చావు, రైతు ఆత్మహత్య నమోదు కాలేదని గుర్తు చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్లో మొత్తం 80 శాతం సీట్లు బీజేపీ దక్కించుకుంటుందని,  20 శాతం స్థానాల్లో మాత్రమే మిగిలిన పార్టీలు విజయం సాధిస్తాయని చెప్పారు. 2017 యూపీ అసెంబ్లి ఎన్నికల్లో 325 స్థానాలు బీజేపీ గెలుచుకుంది. ఇది మొత్తం స్థానాల్లో 80 శాతమే అవుతాయి కదా..? యోగి ఆదిత్యనాథ్ మాటలలో… :

ఆ సమయంలో.. ఇద్దరు అబ్బాయిలు (అఖిలేష్‌ యాదవ్‌, రాహుల్‌ గాంధీ) కలిసి మహా ఘట్‌ బంధన్‌ ఏర్పాటు చేశారు. అధికారంలో ఉన్న ఎస్‌పీ.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. లోక్‌దళ్‌తో పాటు మరికొన్ని పార్టీలు జత కట్టాయి. అప్పుడే బీజేపీకి 80 శాతం సీట్లు వచ్చాయి

2019.. లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ.. మహా ఘట్‌ బంధన్‌ ఏర్పాటైంది. ఎస్‌పీ, బీఎస్‌పీ, కాంగ్రెస్‌, లోకదళ్‌ అందులో ఉన్నాయి. ఆ సమయంలోనే.. బీజేపీ 80 శాతం సీట్లు సాధిస్తుందనే దృఢ నిశ్చయంతో ఉండింది. రాజకీయ విశ్లేషకులు కూడా దీన్ని స్వాగతించారు. 

80 లోక్‌సభ స్థానాలకు పోటీ జరగ్గా.. 64 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఇది 80 శాతం సీట్లు అవుతాయి. 16-10 బీఎస్‌పీ, ఎస్‌పీ 5, కాంగ్రెస్‌ 1 స్థానం, మిగిలినవి ఇతర పార్టీలు గెలిచాయి. ఇది 20 శాతం స్థానాలే అవుతాయి.

బీజేపీ అధికారంలోకి వచ్చాక.. కేంద్రంలో, రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు తావివ్వలేదు. ఓ వర్గం వ్యక్తిని కించపర్చడం, మరో వర్గం వ్యక్తికి అందలం ఎక్కించడం ఎక్కడా జరగలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాల వారికి సమానంగానే తీసుకొచ్చాం. రుణ మాఫీ చేస్తామనే మేము అధికారంలోకి వచ్చాం. అది చేశాం. రైతులకు సంబంధించిన రూ.1లక్ష రుణాన్ని మాఫీ చేశాం. 

ఇళ్లు లేని వారికి పక్కా ఇల్లు కట్టి ఇచ్చాం. సమాజంలోని ప్రతీ ఒక్కరు లబ్ది పొందారు. రిజర్వేషన్లు పక్కాగా అమలు చేశాం. ప్రతీ ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాం. ఓబీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీలకు సరైన స్థాయిలో రిజర్వేషన్‌ కల్పించాం. మహిళలకు భద్రత విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నాం. 

 యూపీలో ఎన్ని బాంబు పేలుళ్లు జరిగినా.. అవి సమాజ్‌వాదీ పార్టీ హయాంలోనే జరిగాయి. బహుజన్‌ సమాజ్‌ పార్టీలోనూ ఇలాంటి ఘటనలు కొన్ని చూశాం. కానీ బీజేపీ అధికారంలోకి తరువాత ఇలాంటివి ఏవీ చూసేందుకు దొరకలేదు. రాష్ట్ర వ్యవస్థకు కీలకం లా అండ్‌ ఆర్డర్‌. మాఫియాను పెంచి పోషించారు. తమ స్వార్థ రాజకీయాల కోసం పేదలను బలి చేశారు. ఉగ్రవాదులకు సంబంధించిన విచారణలను వెనక్కి తీసుకునే నిర్ణయం కూడా ఎస్‌పీ, బీఎస్‌పీ హయాంలోనే చూశాం.

లక్నో, అయోధ్య, వారణాసిలో జరిగిన పేలుళ్ల ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. సంకట్‌ మోచన్‌ ఆలయంలో జరిగిన పేలుడు ఘటనలో 28 మంది అమాయకులు చనిపోయారు. 2012లో ఎస్‌పీ తన మేనిఫెస్టోలో ఓ కీలకం అంశం చేర్చింది. 

ఈ ఉగ్రవాద ఘటనల విషయంలో.. నిర్ధోషులుగా ఉన్న వారిని జైలు నుంచి విడిపిస్తామని ప్రకటించింది. 2012-2013లో దీనికి సంబంధించిన విచారణలను వెనక్కి తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. ఏ పేలుడులో అయినా సైకిల్‌ ఉపయోగం జరిగింది. అహ్మదాబాద్లో జరిగిన వరుస పేలుళ్లలో కూడా సైకిళ్లను వాడారు. అందుకే సైకిల్‌ అంటే ఉగ్రవాదం అని అంటాను. ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడాలంటే ఆలోచించాల్సి ఉంటుంది. 

(ఆంధ్రప్రభ కధనం నుండి)