కన్నెగంటి హనుమంతు పల్నాడు జిల్లాగా పేరు మార్చాలి 

నూతనంగా ప్రతిపాదించిన“పల్నాడు జిల్లా” ను “కన్నెగంటి హనుమంతు పల్నాడు జిల్లా” గా మార్పుచేయాలని పల్నాడు మేధావుల వేదిక విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు జిల్లా కలెక్టర్ కు వేదిక అధ్యక్షుడు కోదూరు సాంబశివరావు, కార్యదర్శి యతిరాజు రాంమోహనరావు వినతిపత్రం సమర్పించారు. 
రాష్ట్రప్రభుత్వం గుంటూరు జిల్లాలో నూతనంగా నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయాలని చేసిన ప్రకటన పట్ల పల్నాడు మేథావుల వేదిక హర్షం వ్యక్తం చేసింది. మనదేశం “ఆజాదీ కి అమృత్ మహోత్సవం” జరుపుకుంటున్న తరుణంలో ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు కన్నెగంటి హనుమంతు పేరును చేర్చుతూ మార్చాలని వారు సూచించారు.

కన్నెగంటి పోరాటాన్ని పలువురు ప్రముఖులు సైతం పలు సందర్భాలలో కొనియాడారని, వారిలో కవికోకిల గుర్రం జాషువా, మాజీ ముఖ్యమంత్రి కాసు ప్రహ్మానందరెడ్డి వంటి ఎంతోమంది ఉన్నారని వారు గుర్తు చేశారు. 

 
కన్నెగంటి పరాక్రమాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పల్నాడు సీమలో అడవుల్లో పుల్లలు ఏరుకోవడం, పశువులను మేపడంపై బ్రిటీష్ పాలకులు ఆంక్షలు విధించారు. పశువులకు రెండు రూపాయలు శిస్తుగా కట్టాలని ఆదేశించారు. మహాత్మాగాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమానికి ఉత్తేజితుడైన కన్నెగంటి హనుమంతు పుల్లరి ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకించాడు.
 
 బ్రిటీష్ నిరంకుశ పాలనలో భారతీయులు అనుభవిస్తున్న అవస్థలు అవమానాలను చూసి రగిలిపోయిన కన్నెగంటి హనుములకు పోరుబాట పట్టాడు. అనేకమంది యువకులను కలుపుకొని ఒక దండులా కదిలాడు. తెల్లవారిపై దండయాత్ర చేసాడు. ఉడుకు రక్తం కలిగిన యువకులు ఆయన వెంట నడిచారు. పెద్దతరం నిండు మనసుతో కన్నెగంటి నాయకత్వాన్ని అంగీకరించి, ఆశీర్వదించారు. మహిళలు, వృద్ధులు నైతిక మద్దతు ఇచ్చారు. 
 
పలనాడు సీమలో కన్నెగంటి ప్రతాపం ప్రారంభమైంది. బ్రిటీష్ ప్రభుత్వాన్ని గడగడలాడించాడు. తెల్ల వారి సైన్యం తెల్లమొఖం వేసింది. వారు కుయుక్తులు కన్నెగంటి సాహసం, నిబద్దత ముందర నిర్వీర్యం అయ్యాయి. ఈ ఉద్యమం “పుల్లరి ఉద్యమం”గా ఉధృతరూపం దాల్చింది.

అయితే బ్రిటీష్ జనరల్ టి.జి. రూథర్ ఫర్డ్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కొంతమంది నయవంచకులను చేరదీశాడు. ఎప్పటికప్పుడు కన్నెగంటి కదలికలను తెలుసుకొని ఆయనను మట్టుబెట్టాలని ప్రయత్నాలు చేశాడు. దాంతో బ్రిటీష్ జనరల్ టి. జి. రూథర్ ఫర్డ్ ఒక కుట్ర పన్నాడు. 1922 ఫిబ్రవరి 22 కొందరు అటవీ, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులతో మించాలపాడు గ్రామానికి వచ్చాడు. 

 
అదే రోజు మధ్యాహ్నం మహాశివరాత్రి సందర్భంగా మించాలపాడుతో సహా చుట్టుప్రక్కల గ్రామాలలోని యువకులు, కన్నెగంటి అనుచరులు, అభిమానులు ప్రభతో కలిసి కోటప్పకొండకు వెళ్ళారు. గ్రామాల్లో మహిళలు, వృద్ధులు మాత్రమే ఉన్నారు. అది అదనుగా భావించిన బ్రిటీష్ పోలీసు సేనలు గ్రామాన్ని దిగ్బంధం చేశాయి. పశువులను మందగా చేసి తోలుకు పోయేందుకు ప్రయత్నించారు. అడ్డు వచ్చిన వారిని తుపాకీ మడమలతో కొట్టి హింసించారు.

ఈ విషయం తెలుసుకొన్న కన్నెగంటి అధికారులతో మాట్లాడి పుల్లరి చెల్లించి రావడానికి ఆ దిశగా వెళ్లాడు. ముందస్తు హెచ్చరిక లేకుండా కన్నెగంటిని బ్రిటీష్ సేనలు చుట్టుముట్టి కాల్పులు జరిపాయి. కన్నెగంటి శరీరంలోకి 26 తూటాలు దూసుకుపోయాయి. సాయంత్రం 6 గంటలకు తుపాకి తూటాలకు గాయపడిన పల్నాటి సింహం కన్నెగంటి అర్ధరాత్రి వరకు శక్తి కూడదీసుకొని వందేమాతరం అని నినాదాలు చేస్తూనే ఉన్నాడు. అర్ధరాత్రి దాటాక పల్నాటి వీరబిడ్డడు అమరుడయ్యాడు.

ఆ మహావీరుడు దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈ ఫిబ్రవరి 22 తేదీకి 100 సంమవత్సరాలు పూర్తి కావస్తున్నందున నూతనంగా ఏర్పడబోయే “పల్నాడు జిల్లా” ను “కన్నెగంటి హనుమంతు పల్నాడుజిల్లా” గా నామకరణం చేయడం అంతటి స్వాతంత్య్ర  సమరయోధునికి, నిష్కళంక దేశభక్తునికి, వీర విప్లవ వేగుచుక్కకు మనం ఇవ్వగల నిజమైన నివాళి కాగలదని  పల్నాడు మేధావుల వేదిక తెలిపింది.

ఈ విషయాలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రతిపాదిత “పల్నాడు జిల్లా”కు ముందు కన్నెగంటి హనుమంతు పేరును చేర్చి “కన్నెగంటి హనుమంతు పల్నాడు జిల్లా”గా మార్చే విధంగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించవలసినదిగా వారు జిల్లా కలెక్టర్ ను కోరారు.