పోర్టుల్లో రూ లక్ష కోట్లతో మౌలిక వసతులు

దేశంలో పోర్టుల్లో లక్ష కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం సాగరమాల, గతిశక్తి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌ తెలిపారు. ఉపాధి కల్పన, ఆదాయాల అభివృద్ధి, పోర్టుల్లో నాణ్యమైన ఉత్పత్తుల కోసం మారిటైం మిషన్‌ 2030 పని చేస్తోందని చెప్పారు.
 
 వైజాగ్‌ పోర్టు విశేషమైన అభివృద్ధి సాధిస్తోందని, కార్గో బిజినెస్‌ నిర్వహిస్తోందని మంత్రి కొనియాడారు. విశాఖలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ పోర్టు మౌలిక వసతులను సృష్టించడమే లక్ష్యంగా పని చేస్తోందని, దీనికి ఎపి ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉందని చెప్పారు. 
 
విశాఖ గాంధీగ్రాంలో బుధవారం ప్రారంభించిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ మారిటైం షిప్‌బిల్డింగ్‌లో దేశానికి అవసరమైన అభివృద్ధి నమూనాలు అందుతాయని తెలిపారు. ఏరోస్పేస్‌, మారిటైం, షిప్పింగ్‌, ఆటో మొబైల్‌ రంగాల్లో నైపుణ్యాల కోసం ఇది పని చేస్తుందని చెప్పారు. దేశంలో పోర్టుల ప్రగతికి, ఉత్తమ ఆర్థిక ఫలితాల సాధనకు, ఉపాధి కోసం విధాన రూపకల్పన చేసినట్లు తెలిపారు.
 
దేశంలో పోర్టుల ఉనికిని కాపాడేందుకు, దేశ ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకోవడానికి డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డిసిఐ) సేవలు అత్యంత కీలకమైనవని శర్బానంద సోనోవాల్‌ తెలిపారు. విశాఖ డిసిఐలోని ఉద్యోగులు, వివిధ విభాగాల అధిపతులతో వేర్వేరుగా నిర్వహించిన సమావేశంలో డ్రెడ్జింగ్‌ ప్రాధాన్యతలను వివరించారు. 
 
1976 మార్చి 29లో ఏర్పడిన డిసిఐ 45 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా తాను విచ్చేసినట్లు తెలిపారు. దేశ ఆర్థిక రంగంలో డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ సేవలు ఎనలేనివని, పోర్టుల ద్వారా జరుగుతున్న కార్గో హేండ్లింగ్‌ వ్యాపారాలకు అవసరమైన సహాయం డిసిఐ ద్వారానే అందుతుందని తెలిపారు. 
 
డిసిఐ నుంచి అధిక పనితనాన్ని ఆశిస్తున్నామని, అందుకు అనుగుణంగా ఉద్యోగులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఫలితాలను సాధించాలని సూచించారు. పోటీ ప్రపంచంలో ఆర్థికంగా బలం పుంజుకునేలా డిసిఐ ఇంకా ఎన్నో శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. 
 
హెచ్‌బి కాలనీలోని డిసిఐ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్రెడ్జర్‌ మ్యూజియం, రక్షణ రంగంలో ఐటి, రోబోటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లకు సంబంధించిన కంప్యూటర్‌ టెక్నాలజీస్‌, నైపుణ్యాల అభివృద్ధి కోసం విశాఖలోని గాంధీగ్రాంలో నిర్మించబడిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌ ఇన్‌ మారిటైం షిప్‌బిల్డింగ్‌ (సెమ్స్‌)ను ప్రారంభించారు. పోర్టు చైర్మన్‌ కె.రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.