ఏపీ పీఆర్సీ జీవోలపై హైకోర్టు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్టు హెచ్చరించింది. 
 
ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన పీఆర్సీ జీవోల ద్వారా సర్వీసు సర్వీస్ బెనిఫిట్స్ తగ్గిస్తున్నారని, జీతాల నుంచి రికవరీ చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ ఏపీ గజిటెడ్ అధికారుల సంఘం జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య గత నెలలో హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచి రికవరీ చేయొద్దని ఆదేశిస్తూ.. కేసు విచారణ వాయిదా వేసింది.
ఉద్యోగం కోసం జీవితాలను ధారపోసిన ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని, ఈ రికవరీలకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. 
 
 పీఆర్సీ విషయంలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అశుతోశ్‌ మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. నివేదికను ఉద్యోగులకు ఇవ్వకుండా గోప్యత ఎందుకు పాటిస్తున్నారని ప్రశ్నించింది. న్యాయస్థానానికి మాత్రమే నివేదికను అందజేస్తామని చెప్పేందుకు ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక అధికారం ఏమిటని ప్రశ్నించింది. 
 
అలాగే పీఆర్సీ జీవోలకు సంబంధించిన ప్రతులన్నీ పిటిషనర్ కు ఇవ్వాలని, అలాగే అసుతోష్ మిశ్రా కమిషన్ రిపోర్టు తోపాటు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. . విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది.