800 రోజుల మైలురాయిని చేరుకున్న అమరావతి రైతుల ఉద్యమం

అమరావతే ఏకైక రాజధాని లక్ష్యంగా రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం 800 రోజుల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా గురువారం వారు 24 గంటల సామూహిక నిరాహారదీక్ష చేపట్టారు. ఉద్యమంలో అసువులుబాసిన వారికి నివాళులర్పించారు. ఉదయం 9గంటకు మొదలైన ప్రజాదీక్ష  శుక్రవారం ఉయం 9 గంటల వరకు  కొనసాగింది. 

రాజధాని పరిధి వెలగపూడిలో చేపట్టిన ఈ దీక్షకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, కులసంఘాలు మద్దతు తెలిపాయి. రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతికి దిగజార్చిన ప్రభుత్వం… అమరావతి భూములను అమ్ముతామంటే సహించేది లేదంటూ రైతులు, మహిళలు హెచ్చరించారు.

రాత్రి తెల్లవార్లు దీక్షా శిబిరంలోనే రైతులు, మహిళలు ఉన్నారు. వందలాది మంది రైతులతో మాజీ ఎమ్మెల్యే దూళిపాళ నరేంద్ర ఈరోజు దీక్షను విరమింప చేశారు. మార్చిలో ఉత్తరాంధ్ర నుంచి జేఏసీల ఏర్పాటుతో పాటు రౌండ్‌టేబుల్‌ సమావేశాలను నిర్వహిస్తామని వెల్లడించారు.

నేతల ప్రసంగాలతో దీక్ష శిబిరం ఆద్యంతం హోరెత్తింది. ఏపీ రాజధాని అమరావతేనని కేంద్రమే చెబుతున్నా రాష్ట్రప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోందని దళిత జేఏసీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను మళ్తీ తెస్తే… తాడో పేడో తేల్చుకునేవరకూ విశ్రమించబోమన్నారు.

రాజధానికి భూములిచ్చిన రైతులకు భవిష్యత్తులో నూ ఇబ్బంది రాకుండదని అప్పటి సీఎం చంద్రబాబు సీఆర్డీఏ చట్టాన్ని పకడ్బందిగా రూపొందించారని మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కాల్వ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. రైతుల దీక్షకు వీరు మద్దతు తెలిపారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని…ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేస్తామని వారు హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో భారత రాజ్యాంగం కాకుండా ‘భారతీ’ రాజ్యాంగం నడుస్తోంది’ అని బీజీపీ నేత, మాజీ మంత్రి  ఆదినారాయణరెడ్డి విమర్శించారు. అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని బీజేపీ నేత, మాజీ మంత్రి  కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. మరో నేత పాతూ రి నాగభూషణం మాట్లాడుతూ అమరావతి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అని దాన్నీ ఎలా చేయాలో ఆయనే చూసుకుంటారని చెప్పారు. 

కాగా రాజధానిలో 40కిపైగా కేంద్రప్రభుత్వ సంస్థలు స్థలాలు కొనుగోలు చేశాయని,  3-4నెలల్లో ఆయా కార్యాలయాల నిర్మాణాలు ప్రారంభమవుతాయని బీజేపీ నేతలు తెలిపారు