ఒమిక్రాన్‌ నుండి కోలుకున్నా కొనసాగుతున్న ప్రభావం

మూడో వేవ్‌ కారణమైన ఒమిక్రాన్‌ నుండి కోలుకున్నా ఆ ప్రభావం తనపై ఇంకా కొనసాగుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ తెలిపారు. భౌతిక విచారణలు చేపట్టాలంటూ ఓ సీనియర్‌ న్యాయవాది చేసిన అభ్యర్థనపై ఆయన స్పందిస్తూ తనకు ఒమిక్రాన్‌ సోకిందని, అయితే కోలుకున్నా కూడా ఇంకా బాధపడుతూనే ఉన్నానని చెప్పారు. 

ఒమిక్రాన్‌ వైరల్‌ జ్వరంగా మారిందని, లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని, ప్రజలు కూడా త్వరగానే కోలుకుంటున్నందున పూర్తి స్థాయిలో భౌతిక విచారణలను పునరుద్ధరించాలని అత్యున్నత న్యాయస్థానం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ సిజెఎను అభ్యర్థించారు. 

దీనిపై జస్టిస్‌ ఎన్‌వి రమణ స్పందిస్తూ. తాను ఈ మూడో వేవ్‌లోనే కరోనా బారిన పడ్డానని, తగ్గినప్పటికీ.. ఇంకా తనను బాధిస్తుందని పేర్కొన్నారు. 

ఇది సైలెంట్‌ కిల్లర్‌ లాంటిదని, కరోనా తొలి వేవ్‌లో వైరస్‌ బారిన పడినా.. త్వరగానే కోలుకున్నానని, కానీ ఒమిక్రాన్‌ సోకి 25 రోజులు గడుస్తున్నా.. ఇబ్బంది పడుతూనే ఉన్నానని తెలిపారు. అయితే వైరస్‌ పరిస్థితి సమీక్షించి, పూర్తి స్థాయి భౌతిక విచారణలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

ఇలా ఉండగా,  దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. క్రితంరోజు కన్నా… రెండువేల కేసులు అధికంగా నమోదయ్యాయి. మంగళవారం రోజు 13 వేలు కేసులు నమోదవ్వగా, బుధవారం నాటికి 15 వేల కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

బుధవారం నమోదైన 15,102 కేసులతో కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,28,67,031కి చేరింది. అయితే రోజువారీ కేసులు తగ్గడం కొంత ఊరటనిస్తోంది. ఇక గడచిన 24 గంటల్లో 278 మంది కరోనాకు బలయ్యారు. 

దీంతో దేశవ్యాప్తంగా కరోనా  మృతుల సంఖ్య 5,12,622కు చేరింది. పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉండగా, యాక్టివ్‌ కేసులు 0.38 శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజే 31,377 మంది కరోనా నుంచి కోలుకున్నారని ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా.. 1,76,19,39,020 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.