ఏప్రిల్‌ 10న శ్రీసీతారాముల కల్యాణం, 11న పట్టాభిషేకం

* ఏప్రిల్‌ 2 నుంచి 16 వరకు భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు

దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్‌ 10న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు శ్రీసీతారాముల తిరుకల్యాణోత్సవం (శ్రీరామనవమి) నిర్వహించనున్నారు. ఈ మేరకు వైదిక కమిటీ రూపొందించిన బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను ఆలయ ఈఓ బి.శివాజీ ప్రకటించారు. 

 
ఏప్రిల్‌ 2 నుంచి 16 వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 2న శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణం, తిరువీధి సేవలు ప్రారంభమవుతాయని, 6న ఉత్సవమూర్తులకు విశేష స్నపనం, ఉత్సవ అంకురార్పణ జరుపుతారు. 
 
7న గరుడ ధ్వజపట భద్రక మండల లేఖనం, గరుడాధివాసం, 8న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, చతుఃస్థానార్చన, భేరీ పూజ, దేవతాహ్వానం, బలిహరణం, హనుమద్వాహన సేవ, 9న ఎదుర్కోలు ఉత్సవం, గరుడ వాహన సేవలను నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌లో వివరించారు.

10న శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం, శ్రీరామ పునర్వసు దీక్షా ప్రారంభం, చంద్రప్రభ వాహన సేవ, 11న మహాపట్టాభిషేకం, రథోత్సవం జరుగుతాయని పేర్కొన్నారు. 12 నుంచి 16 వరకు వివిధ పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 

 
కాగా, కరోనా ఆంక్షలను ప్రభుత్వం సడలించిన నేపథ్యంలో భక్తులకు ఈ ఏడాది మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వీక్షించే అవకాశం ఉంటుందని సమాచారం. అయితే ఈ విషయంలో ఆలయ అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.