టీఆర్ఎస్ నుండి రాజ్యసభకు ప్రకాష్ రాజ్!

గత లోక్ సభ ఎన్నికలలో బెంగళూరు నగరం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి డిపాజిట్ కూడా కోల్పోయిన ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు  టీఆర్​ఎస్​ నుండి రాజ్యసభకు ఎన్నిక కావాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఆ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నుండి ఆయనకు హామీ లభించినట్లు చెబుతున్నారు. 
 
గత ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లను కలవడానికి కేసీఆర్  వెళ్లిన బృందంలో అనూహ్యంగా ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. ఆయన చాలాకాలంగా కేసీఆర్ కు సన్నిహితంగా వ్యవహరిస్తున్నా ఇప్పటి వరకు టీఆర్​ఎస్​ లో ప్రాధమిక సభ్యుడు కాకపోవడం గమనార్హం. 
 
కర్ణాటక, తమిళనాడు లలో బిజెపి వ్యతిరేక రాజకీయాలలో మంచి పరిచయాలున్న ప్రకాష్ రాజ్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలని తాను చేస్తున్న ప్రయత్నాలకు సహకారిగా ఉండగలరని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. 
 
 ఇటీవలే రాజ్యసభ సభ్యుడు బండి ప్రకాశ్ తన పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయ్యారు. దీంతో ఆ సీటు ఖాళీ అయింది. జూన్‌‌లో టీఆర్ఎస్‌‌ రాజ్యసభ సభ్యులు కెప్టెన్​ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్​ పదవీ కాలం ముగియనుంది. ఈ మూడు ఖాళీలకు ఒకేసారి నోటిఫికేషన్​ వెలువడే అవకాశాలున్నాయి. 
 
ఈ ఖాళీల్లో  ఒక సీటును ప్రకాశ్ రాజ్‌‌కు కేటాయించి, టీఆర్ఎస్​ తరఫున ఢిల్లీ రాజకీయాల్లో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతున్నది. అయితే సినిమాలలో బాగా రాణించినా ప్రజా జీవనంలో ప్రకాష్ రాజ్ చెప్పుకోదగిన ప్రభావం చూపలేక పోవడం గమనార్హం. 
 
చివరకు తెలుగు సినీ ఆర్టిస్టుల అసోసియేషన్ అధ్యక్ష పదవికి బాగా హడావుడి చేసి, పోటీ చేసి, చిరంజీవి వంటి అగ్రనటుడు మద్దతు ఇచ్చినా గెలవలేక పోయారు.  తరచూ అనుచితంగా ఆయన చేసే వాఖ్యలు రాజకీయంగా ప్రయోజనకారి కాకపోవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆవేశం ఎల్లప్పుడూ ప్రజా జీవనంలో, ముఖ్యంగా రాజకీయాలలో పనికిరాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 
దేశ విచ్ఛిన్నకర శక్తులతో కలుస్తారా?
 
ఇలా ఉండగా,  దేశ విచ్ఛిన్నకర శక్తులకు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ మద్దతు పలికారని, అలాంటి వ్యక్తితో కలిసి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో భేటీ వెనుక మతలబు ఏంటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. జిగ్నేశ్‌, ఉమర్‌ ఖలీద్‌.. వంటి వారితో కలిసి ప్రకాశ్‌రాజ్‌ దేశ వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. 
 
దేశాన్ని ఏలాలని తుక్డే గ్యాంగ్‌ కలలు గంటోందని, వారి కలలు కల్లలుగానే మిగిలిపోతాయని స్పష్టం చేశారు. తనను ఎప్పుడు సీఎం చేస్తావంటూ మంత్రి కేటీఆర్‌తో ఇంట్లో పోరు ఎక్కువైందని, అందుకే కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళతానని, ఫెడరల్‌ ఫ్రంట్‌ పెడతామని డ్రామాలాడుతున్నారని సంజయ్ విమర్శించారు.
 
మరోవంక,  దేశ ఐక్యత, సైనిక శక్తిని అనుమానించిన ఉమర్‌ ఖలీద్‌, కన్హయ్య కుమార్‌, మసూద్‌ అజర్‌ వంటి వారికి మద్దతు ఇచ్చిన ప్రకాశ్‌రాజ్‌తో కలిసి ప్రయాణించడం దేనికి సంకేతం..?’’ అని బీజేపీ నేత, మధ్య ప్రదేశ్ ఇన్ ఛార్జ్  మురళీధర్‌రావు కేసీఆర్‌ను ప్రశ్నించారు. దేశ విచ్ఛిన్నకర శక్తులతో కేసీఆర్‌  మమేకమవుతున్నారని మండిపడ్డారు.