చిత్రా రామకృష్ణకు సిబిఐ లుక్‌ అవుట్‌ నోటీసులు

జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ మాజీ సిఇఒ చిత్రా రామకృష్ణకి  సిబిఐ లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పన్ను ఎగవేతకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా గురువారం ఆమె నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు.  

తాజాగా స్టాక్‌మార్కెట్‌లో అవతవకలు జరగడంతో పాటు సెబీ నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది.  ఎన్‌ఎస్‌ఇలో అక్రమాలకు సంబంధించిన పాత కేసులో భాగంగా ఆమెను విచారించారు. అంతేగాక, దేశం విడిచి వెళ్లకుండా ఉండేలా లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

ఆమెతో పాటు ఎన్‌ఎస్‌ఈ మాజీ సిఇఒ రవి నరైన్‌, మాజీ సిఒఒ ఆనంద్‌ సుబ్రమణియన్‌లకు కూడా లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. జాతీయస్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఇ)కి సిఇఒ, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా 2013 నుండి 2016 వరకు విధులు నిర్వహించారు.

అనంతరం వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఎన్‌ఎస్‌ఇలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు 2018లో ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఇటీవల హిమాలయాల్లో నివసించే ఒక `అదృశ్య’ యోగితో ఎన్‌ఎస్‌ఈకి సంబంధించిన కీలక విషయాలను పంచుకున్నారని, నియామకాల్లో ఆయన చెప్పినట్లే  నడుచుకున్నారని సెబీ  వెల్లడించిన ప్రకటనలో పేర్కొంది.

స్టాక్ మార్కెట్‌లో ముందస్తు సమాచారాన్ని పొందడం ద్వారా లాభాలు పొందేందుకు తమకున్న అధికారాలు, అవకాశాలను దుర్వినియోగం చేశారంటూ వీరిపనై ఆరోపణలు వచ్చాయి.  ఈ క్రమంలోనే… ఢిల్లీకి చెందిన ఓపీజీ సెక్యూరిటీస్ యజమాని/ప్రమోటర్ సంజయ్ గుప్తా సహా మరికొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. 

మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సహా ఎన్‌ఎస్‌ఈకి చెందిన గుర్తుతెలియని అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆమెపై నమోదైన పాత కేసుల్లో అధికారులు మళ్లీ దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే శుక్రవారం సిబిఐ ఆమెను విచారిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.