మన్మోహన్ ఎన్నికల ప్రయోజనాల కోసమే మాట్లాడతారా?

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే మాట్లాడతారా? అంటూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సూటిగా ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్ధిక విధానాలపై మాజీ ప్రధాని తీవ్రంగా విమర్శించడాన్ని ప్రస్తావిస్తూ  మన్మోహన్ పరిపాలన కాలంలో విదేశీ పెట్టుబడులపై మితిమీరి ఆధారపడిన ఐదు దేశాల్లో ఒకటిగా భారత దేశానికి చెడ్డపేరు వచ్చిందని ఆమె గుర్తు చేశారు. 

మోర్గాన్ స్టాన్లీకి చెందిన ఓ ఫైనాన్షియల్ అనలిస్ట్ 2013 ఆగస్టులో ఫ్రాజిల్ ఫైవ్ అని ఐదు దేశాలను పిలిచారు. తమ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఆధారపడటానికి వీలు కానటువంటి విదేశీ పెట్టుబడులపై మితిమీరి ఆధారపడినట్లు తెలిపారు. బ్రెజిల్, భారత దేశం, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, టర్కీ దేశాల ఆర్థిక వ్యవస్థలను ఫ్రాజిల్ ఫైవ్‌గా పేర్కొన్నారని ఆమె వివరించారు.

మన్మోహన్ సింగ్ గురువారం విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ ఆర్థిక, విదేశాంగ విధానాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మన దేశ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోలేకపోతోందని విమర్శించారు. తప్పుడు ఆర్థిక విధానాల వల్ల దేశంలో నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరిందని ధ్వజమెత్తారు.

రైతులు, వ్యాపారవేత్తలు, మహిళలు, విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ వీడియో విడుదలైన కాసేపటికే నిర్మల సీతారామన్ విలేకర్ల సమావేశంలో 22 నెలలపాటు ఆయన ద్రవ్యోల్బణాన్ని నియంత్రించ లేకపోయారని  పేర్కొన్నారు. మన దేశం నుంచి మూలధనం ఎగిరిపోయిందన్నారు.

అటువంటి (మాజీ) ప్రధాన మంత్రికి నేడు అకస్మాత్తుగా భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా గుర్తొచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు.  ఇదంతా పంజాబ్ శాసన సభ ఎన్నికల కోసమేనా? అని అడిగారు. అందరినీ కలుపుకొనిపోవడం గురించి ఆయన మాట్లాడారని, పంజాబ్‌లో టీకాలను లాభాలకు అమ్ముకుంటున్నపుడు ఆయన ఎందుకు మాట్లాడలేకపోయారని ఆమె ప్రశ్నించారు.

వ్యాక్సిన్లనేవి లాభాలు సంపాదించడం కోసం కాదని ఎందుకు చెప్పలేకపోయారని నిర్మలా సీతారామన్ అడిగారు. ఆయనంటే తనకు చాలా గౌరవభావం ఉందని, అయితే ఇటువంటి వ్యాఖ్యలను ఆయన నుంచి తాను ఊహించలేదని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం టీకాలను ప్రైవేటు ఆసుపత్రులకు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.