పెట్టుబడుల ఉపసంహరణ దిశగా ఐడీబీఐ

ఐడీబీఐ బ్యాంకు నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు సిద్ధమై ప్రభుత్వం ఆ దిశగా చర్యలను ప్రారంభించనుంది. తొలుత ప్రయివేటు పెట్టుబడిదారుల ఆసక్తిని తెలుసుకునేందుకు రోడ్‌షోలు నిర్వహించనుంది. ఫిబ్రవరి 25 నుంచి ఇవి ప్రారంభం కానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వంతోపాటు ఎల్‌ఐసీకి మెజారిటీ వాటా ఉంది. అయితే పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా తమ వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు వర్చువల్‌ మాధ్యమంలో రోడ్‌షోలు నిర్వహించాలని నిర్ణయించింది. 

పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం, కేపీఎంజీ, లింక్‌ లీగల్‌ సంయుక్తంగా ఈ రోడ్‌షోలను నిర్వహంచనున్నాయి. ఐడీబీఐలో ప్రభుత్వానికి 45.48శాతం, ఎల్‌ఐసీకి 49.24 శాతం వాటాలున్నాయి. కొత్త కొనుగోలుదారుకు యాజమాన్య హక్కులు బదిలీ చేసేందుకు వీలుగా తమ వాటాల్లోనూ కొంత విక్రయించాలని ఎల్‌ఐసీ యోచిస్తోంది. 

ఆర్‌బిఐను సంప్రదించి ఎవరు ఎంత వాటా విక్రయించాలో నిర్ణయించనున్నారు. విశ్సనీయ సమాచారం ప్రకారం  ప్రభుత్వం 26 శాతం వాటాలను అట్టిపెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా రోడ్‌షోలు నిర్వహించడం ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను సిద్దం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. లావాదేవీకి సంబంధించిన విధివిధానాలనూ రూపొందించేందుకు అవగాహన వస్తుంది. అలాగే ఆసక్తి ఉన్న పెట్టుబడిదారుల్లో ఎవరు తగిన వారన్న దానిపై కూడా ఓ ముందస్తు అవగాహన ఏర్పడుతుంది.