హిజాబ్ వివాదం 8 కాలేజీలకే పరిమితం

రాష్ట్రంలోని 75 వేల హైస్కూళ్లు, కళాశాలల్లో కేవలం ఎనిమిదిలో మాత్రమే హిజాబ్ వివాదం ఏర్పడిందని కర్నాటక ప్రాథమిక, మాధ్యమిక విద్యా శాఖ మంత్రి బిసి నగేష్ తెలిపారు. ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కాగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు గతవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విద్యార్థులు కాషాయం శాలువాలు, స్కార్ఫ్‌లు, హిజాబ్ ధరించడంతోపాటు ఎటువంటి మతపరమైన పతాకాలను తరగతులలోకి తీసుకెళ్లరాదని ఆదేశించింది. 

అయితే, హిజాబ్, బుర్ఖా ధరించి తరగతులకు హాజరవుతామని కొందరు విద్యార్థినుల గురువారం కూడా పట్టుబట్టడంతో ఈ వివాదం సద్దుమణగడం లేదు. గురువారం విలేకరులతో మంత్రి నగేష్ మాట్లాడుతూ ఈ సమస్య కేవలం అతి స్వల్ప సంఖ్యలో కొన్ని స్కూళ్లు, కాలేజీలకే పరిమితమైందని చెప్పారు.

ఇలా ఉండగా.. బళ్లారిలోని సరళాదేవి కళాశాలలోకి బుర్ఖా ధరించిన విద్యార్థినులను అనుమతించకపోవడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కాలేజీ ముందు ధర్నా చేశారు. పోలీసులు, న్యాయవాదులు హైకోర్టు ఉత్తర్వులను చూపించి వారిని నచ్చచెప్పి అక్కడ నుంచి పంపివేశారు. 

బెలగావిలోని విజయ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పారా మెడికల్ సైన్సెస్ ఎదుట కొందరు వ్యిర్థులు అల్లాహో అక్బర్ అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. చిత్రదుర్గలోని మహిళా పియు కాలేజ్ వద్ద కూడా విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఇలా ఉండగా, బెంగళూరులో నిషేధాజ్ఞలను ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్టు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. హిజాబ్ వివాదం కారణంగా ప్రభుత్వం నగరంలోని అన్ని పాఠశాలల వద్ద 144 సెక్షన్‌ విధించిన విషయం తెలిసిందే. అయితే, ప‍్రస్తుతం తొమ్మిది జిల్లాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉన్నట్టు అధికారులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అనేక పట్టణాలు, విద్యాసంస్థల వద్ద పోలీసులు మోహరించారు.

 ఇదిలా ఉండగా హిజాబ్‌ వివాదం నేపథ్యంలో నిరసనలు, ర్యాలీలను నిషేధించారు. ఫంక్షన్‌ హాల్స్‌, బహిరంగ ప్రదేశాల్లో జరిగే వివాహాల్లో 200-300 మంది హాజరయ్యేందుకే అనుమతించారు. మరోవైపు క్రీడా మైదానాల్లో వాటి సామర్థ్యంలో 50 శాతానికి మించి ప్రేక్షకులు హాజరు కాకుడదని పేర్కొన్నారు.

కాగా,  బీజేపీ ముస్లిం మహిళలకు వ్యతిరేకం కాదని సంబంధితులందరికీ స్పష్టంగా తెలియజేయాలని, వస్త్ర ధారణకు సంబంధించిన నిబంధనలను ఆయా విద్యా సంస్థలకే వదిలిపెట్టినట్లు వివరంగా చెప్పాలని పార్టీ కేంద్ర నాయకత్వం తమకు సూచించింనల్టు బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు తెలిపారు. 

హిజాబ్ వివాదం నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులపై తమ పార్టీ అధిష్ఠానం తమకు ఓ సలహా ఇచ్చిందని మంగళూరు సిటీ బీజేపీ ఎమ్మెల్యే భరత్ షెట్టితెలిపారు. అయితే దీనిపై నిర్దిష్ట సూచనలేవీ చేయలేదని పేర్కొన్నారు. సంబంధితులందరి వద్దకు వెళ్ళాలని, వారిని విశ్వాసంలోకి తీసుకోవాలని చెప్పినట్లు తెలిపారు. విద్యా సంస్థల యాజమాన్యాలు, కమ్యూనిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులతో స్థానికంగా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.