ప్రతిపక్షాలది, పాకిస్థాన్‌దీ ఒకే ఎజెండా

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో 2016లో భారత సైన్యం నిర్వహించిన లక్షిత దాడులకు రుజువులు చూపాలంటున్న ప్రతిపక్ష పార్టీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  విరుచుకుపడ్డారు. మన ప్రతిపక్షాలది, పాకిస్థాన్‌ది ఒకే విధమైన ఎజెండా అని మండిపడ్డారు. ఉత్తర ప్రదేశ్, బిహార్ సోదరులను పంజాబ్‌కు రానివ్వొద్దని ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ చెప్పడంపై కూడా మోదీ ధ్వజమెత్తారు. 

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా మోదీ విరుచుకుపడుతూ  ‘‘మిమ్మల్ని ఢిల్లీకి రానివ్వనివారు, ఇప్పుడు పంజాబ్‌కు వచ్చి మీ ఓట్లు కోరుతున్నారు’’ అని ఎద్దేవా చేశారు.  అమరులైన సైనికుల త్యాగాలను కాంగ్రెస్ చిన్నచూపు చూస్తోందని, అవమానిస్తోందని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్జికల్ స్ట్రైక్స్‌ పట్ల యావద్భారతావని కలిసికట్టుగా స్పందించిందని, కేవలం కాంగ్రెస్ మాత్రమే రుజువులు చూపాలంటోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని, పంజాబ్ ప్రజలను మాత్రమే కాకుండా మన సైన్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు.
 పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో అమరులైనవారిని సంస్మరించుకునే సమయంలో కూడా కాంగ్రెస్ ఇదే వైఖరిని ప్రదర్శించిందని దుయ్యబట్టారు.  కాంగ్రెస్ ‘పాపాత్మ లీల’ను ప్రదర్శించిందని ఆవేదన వ్యక్తం చేశారు.  బీజేపీ ప్రభుత్వ పథకాల వల్ల ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు, చికిత్స అందరికీ అందుబాటులోకి వచ్చినట్లు ప్రధాని తెలిపారు.
పంజాబ్‌లో మాఫియా పాలనను కేవలం బీజేపీ మాత్రమే మార్చగలదని ప్రధాని స్పష్టం చేశారు. పీఎం-కిసాన్ పథకం వల్ల రైతులు లబ్ధి పొందుతున్నారని చెప్పారు.  నూతన దార్శనికతతో కూడిన ప్రభుత్వం పంజాబ్‌కు అవసరమని ఆయన చెప్పారు.
 మొదటిసారి ఓటు వేస్తున్న యువత గొప్ప మార్పు తీసుకురాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. పంజాబ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా మోదీ గురువారం బీజేపీ కూటమి తరపున అభోర్‌లో జరిగిన సభలో మాట్లాడారు. యుపి, బీహార్ వారిని రానీవ్వమని అంటూ ముఖ్యమంత్రి చన్నీ చేసిన వ్యాఖ్యలకు ప్రియాంక గాంధీ చప్పట్లు కొట్టడాన్ని తప్పుబట్టిన ప్రధాని.. కాంగ్రెస్ విధానం ఇదేనా అని ప్రశ్నించారు.
సంత్ రవిదాస్ ఉత్తర ప్రదేశ్‌లోని కాశీకి చెందినవారని, గురు గోవింద్ సింగ్ బిహార్‌లోని పాట్నాకు చెందినవారని, వీరిని కూడా పంజాబ్‌కు రానివ్వరా? అంటూ   ప్రధాని సూటిగా ప్రశ్నించారు.    ఇదేనా కాంగ్రెస్ అభిమతం అని అడిగారు. కాంగ్రెస్ తన బండి నడవడం కోసం ఎల్లప్పుడూ ఒక ప్రాంత ప్రజలను మరొక ప్రాంతంపై ఎగదోస్తూ ఉంటుందని దుయ్యబట్టారు.
పంజాబ్ ముఖ్యమంత్రి బుధవారం ఏం చెప్పారో యావత్తు దేశం విన్నదని చెప్పారు. ఢిల్లీ కుటుంబం, చన్నీ యజమాని (ప్రియాంక గాంధీ) చప్పట్లు కొట్టారని గుర్తుచేశారు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఎవరిని అవమానిస్తున్నారని ప్రధాని  ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్, బిహార్ నుంచి వచ్చిన ప్రజలు చెమటోడ్చి పని చేయని గ్రామం పంజాబ్‌లో ఏదీ లేదని స్పష్టం చేశారు.  సంత్ రవిదాస్ జయంతిని బుధవారం జరుపుకున్నామని, ఆయన ఎక్కడ జన్మించారో చెప్పాలని కాంగ్రెస్ నేతలను అడుగుతున్నానని ఎద్దేవా చేశారు.

‘‘గురు గోవింద్ సింగ్ ఎక్కడ జన్మించారని అడుగుతున్నాను. ఆయన పాట్నాలో జన్మించారు. కాబట్టి ఆయనను మీరు అగౌరవపరుస్తారా? అని ప్రశ్నించారు. గురు గోవింద్ సింగ్ జన్మించిన గడ్డను మీరు అవమానిస్తున్నారు’’ అని మోదీ అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని కనీసం ఒక క్షణమైనా పంజాబ్‌ను పరిపాలించనివ్వకూడదని ప్రధాని స్పష్టం చేశారు.