విభజన చట్ట సవరణపై తెలుగు రాష్ట్రాల పేచీ

ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ గురువారం రెండు రాష్ట్రాల ప్రతినిధులతో జరిపిన సమావేశం ఎటువంటి ఫలితం ఇవ్వలేక పోయింది. విభజన చట్టాన్ని సవరించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపాదించడం, దానిని తెలంగాణ వ్యతిరేకించడంతో ప్రతిష్టంభన నెలకొంది. 

 ఏడున్నరేళ్ళ తర్వాత చట్ట సవరణ కోరడంలో అర్ధంలేదని, ఇది ముమ్మాటికీ వివాదాలు పరిష్కారం కాకుండా కాలయాపన జరిపించే ప్రయత్నంలో భాగమేనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ ఆశిష్‌కుమార్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు. 

పునర్‌వ్యవస్థీకరణ  చట్టంలో అనేక లోపాలున్నాయని, ఫలితంగా పన్నులతో పాటు అనేక అంశాల్లో రాష్ట్రం నష్టపోతోందని ఏపీ అధికారులు చెప్పారు. దీనిని నివారించేందుకు పునర్‌ వ్యవస్థ్కీరణ చట్టానిు సవరించాలనికోరారు.

విభజన సమస్యలు పరిష్కారం కాకుండా కోర్టుల్లో కేసులు పెట్టి తమాషా చూస్తోందని, కేసులన్నీ ఉపసంహరించుకొని చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకొందామని తెలంగాణ రాష్ట్ర ఆర్ధికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు చేసిన ప్రతిపాదనను ఆశిష్ కుమార్ కూడా సమర్ధించారు. 

పన్నుల ఆదాయానికి సంబంధించిన అంశాలపై ఏడున్నర సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోందని, అదీగా కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తెలంగాణకు చెందాల్సిన నిధులను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన నిధులు కూడా ఎక్కడ తిరిగి తెలంగాణకు ఇవ్వాల్సి వస్తుందోననే ఉద్దేశ్యంతోనే ఏపీ ప్రభుత్వం కొత్తగా విభజన చట్టంలో సవరణలు చేయాలని అడుగుతోందని కొందరు అధికారులు ఆరోపించారు.

పన్నుల అంశాలను ద్వైపాక్షిక అంశాల జాబితా నుంచి తొలగించాలని తెలంగాణ అధికారులు చేసిన డిమాండ్‌కు కేంద్ర ఆశిష్ కుమార్ అంగీకరించారు. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన నగదు బకాయిలు కూడా ఇప్పటి వరకూ రాలేదని, ఆ నిధులు వెంటనే ఇప్పించాలని తెలంగాణ అధికారులు కోరారు. దీనిపై స్పందించిన జాయింట్ సెక్రటరీ నగదు బకాయిల వివరాలను తనకు పంపించాలని తెలంగాణ అధికారులను కోరారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్తు బకాయిలపై కోర్టులో దాఖలు చేసిన కేసులను ఉపసంహరించుకుంటే బకాయిల వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని కూడా తెలంగాణ అధికారులు తెలిపారు. అంతేగాక ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ విభజన విషయంలోనూ కోర్టు కేసులను ఉపసంహరించుకుంటేనే ప్రక్రియ ముందుకు సాగుతుందని చెప్పారు.

రాజ్‌భవన్, హైకోర్టు నిర్వహణకు సంబంధించిన బకాయిలు కూడా ఏపీ ఇవ్వలేదని తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేశారు. కేంద్రం నుంచి వచ్చిన రాయితీల్లో వాటా నిధులను చెల్లించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం హామీ ఇస్తే తాము కూడా అందుకు సిద్దంగా ఉన్నట్లుగా ఏపీ ప్రభుత్వ ఆర్ధికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.ఎస్.రావత్ బృందం ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పింది.