తిరుమలలో హోటళ్లు బంద్‌

తిరుమలలో హోటళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు తొలగించి ముఖ్య కూడళ్లలో ఉచితంగా అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయిం చింది. అత్యున్నత స్థాయి నుంచి సామాన్య భక్తుడి వరకు ఒకే రకమైన ఆహారం అందించాలని తీర్మానించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.3,096.40 కోట్ల్ల అంచనాలతో టీటీడీ వార్షిక బడ్జెట్‌ను ఆమోదించినట్టు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. 
 
తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. ఆదాయంలో ప్రధానంగా హుండీ ద్వారా రూ. వెయ్యి కోట్లు, పెట్టుబడుల ద్వారా వడ్డీ రూ. 668.51 కోట్లు, ప్రసాదాల ద్వారా రూ.365 కోట్లు, దర్శనం టికెట్ల విక్రయం ద్వారా రూ.242 కోట్లు, తలనీలాల విక్రయం ద్వారా రూ.126 కోట్లు, ఆర్జితసేవలతో రూ.120 కోట్లు, అద్దె గదులు, కల్యాణ మండపాల ద్వారా రూ.95 కోట్లు, కాటేజీ డోనర్‌ స్కీం కింద రూ.90 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు.
 
టీటీడీ ఆధ్వర్యంలో రూ.230 కోట్లతో తిరుపతిలో చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాల నిర్మాణానికి ఆమోదం తెలిపారు.  తిరుచానూరు సమీపంలో శ్రీపద్మావతి నిలయం అతిథిగృహ సముదాయాన్ని బాలాజీ జిల్లా కలెక్టరేట్‌ కోసం నిర్మించి, రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ నిబంధనల మేరకు లీజుకు ఇస్తారు.
తిరుమలలో అన్నప్రసాదాల తయారీకి నెడ్‌క్యాప్‌ తరపున సోలార్‌ సిస్టమ్‌ రెస్కో మోడల్‌ స్టీమ్‌ కేజీ రూ.2.54తో 25ఏళ్ల పాటు సరఫరాకు ఒప్పందంకు ఆమోదం తెలిపారు.  అలిపిరి వద్ద సైన్స్‌సిటీ నిర్మాణానికి మంజూరు చేసిన 70 ఎకరాల భూమిలో 50 ఎకరాలు వెనక్కి తీసుకుని ఆధ్యాత్మిక నగరం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.
త్వరలో భక్తులకు అందుబాటులోకి అన్నమయ్య మార్గం నిర్మించాలని,  రూ.360 కోట్లతో టీటీడీ ఆయుర్వేద ఫార్మసీకి పరికరాలు కొనుగోలు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఆయుర్వేద మందులు అందుబాటులో ఉంచాలని తీర్మానాలు చేశారు.
టిటిడి ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపు
 
శ్రీవారి ఆర్జిత సేవలు పునరుద్ధరించాలని పాలక మండలి నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనలను సడలించడంతో ఆర్జిత సేవలను సడలించింది. సర్వ దర్శనం, శీఘ్ర దర్శనం టికెట్ల సంఖ్య క్రమంగా పెంచాలని నిర్ణయించింది. 
అయితే  సామాన్య భక్తులకు కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచినట్లు జరిగిన ప్రచారం ఆవాస్తవమని సుబ్బారెడ్డి చెప్పారు.
 
కాగా, సిఫార్సు లేఖలపై జారీ చేసే ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపునకు టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.  సుప్రభాతం రూ.2వేలు, తోమాల, అర్చన రూ.5వేలు, కళ్యాణోత్సవం రూ.2,500, వేద ఆశ్వీరవచనం రూ.10వేల పెంపునకు ఆమోదం లభించిందని చెబుతున్నారు.
అయితే ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపుపై సభ్యుల నుంచి వ్యతిరేకత రావడంతో ఎస్వీబీసీ లైవ్ లింక్‌ను టీటీడీ కట్ చేశారు. పూర్తి వివరాలు వెల్లడించ లేదు. ఇలా ఉండగా, టీటీడీ పాలకులు వివాదాలు సృష్టించొద్దని ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు.  పవిత్రమైన తిరుమల ఖ్యాతిని కాపాడాలని కోరారు. శ్రీవారి జోలికి వెళ్లొద్దని టీటీడీ చైర్మన్, ఈవోలకు విజ్ఞప్తి చేశారు.