ఎస్సి రిజర్వేడ్ సీట్లో క్రైస్తవ మహిళ… పదవీ గండం 

ఎస్సి మహిళకు రిజర్వ్ చేసిన గుంటూరు   జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవిని వైసీపీ అభ్యర్థిగా చేపట్టిన హెన్రీ క్రిస్టినాకు ఇప్పుడు పదవీ గండం వెంటాడుతున్నది. ఆమె ఎస్సి కాదని, క్రైస్తవ మహిళా అని ఫిర్యాదులు వెళ్లడంతో పాటు, స్థానిక సంస్థలకు పోటీచేసేవారికి ఇద్దరికన్నా ఎక్కువ మంది సంతానం ఉండరాదనే నిబంధనను అతిక్రమించారని, ఆమెకు నలుగురు సంతానం అని ఫిర్యాదు చేయరడంతో త్వరలోనే ఆమెకు పదవీ గండం తధ్యమని భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి గట్టి మద్దతురాలైన ఆమె, ముఖ్యమంత్రి అండతో  కొల్లిపర మండలం నుంచి  జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠాన్ని అధిష్టించారు. అయితే క్రిస్టినా అసలు ఎస్సీనే కాదనీ, ఎస్సీలకు రిజర్వ్ అయినా స్థానంలో ఆమెను ఎలా ఎంపిక చేస్తారనీ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి.
ఆమె ఎంపిక నాటి నుంచి ఫిర్యాదుల పరంపరను విపక్షాల వారు కొనసాగిస్తున్నారు. క్రిస్టినాపై కొల్లిపరలో జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి మండ్రు సరళకుమారి జిల్లా కలెక్టర్‌కు, ఎన్నికల కమిషన్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు.
అయినా క్రిస్టినా అధికార పార్టీ అభ్యర్థి కావడంతో ఫిర్యాదులను పట్టించుకోకుండా ఏకపక్షంగా ముందుకు పోయి ఆమెనే జడ్పీ పీఠంపై కూర్చోబెట్టారు. అంతే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారంటూ క్రిస్టినాపై మరో వివాదం తెరపైకి వచ్చింది.
ఇద్దరుకు మించి సంతానం లేని వారు మాత్రమే స్థానిక సంస్థలలో పోటీకి అర్హులు. నలుగురు సంతానం కలిగి ఉన్న క్రిస్టినా అసలు జెడ్పీటీసీగానే పోటీకి అనర్హురాలు అంటూ బీజేపీ అభ్యర్థి సరళకుమారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఈనెల 25వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడంతో క్రిస్టినా మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు.
 
మరోవైపు క్రిస్టినా భర్త కత్తెర సురేష్ నడిపే హార్వెస్ట్ ఇండియా సొసైటీపై కూడా వివాదాలు చుట్టుముట్టాయి. ఓ మతానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్న హార్వెస్ట్ ఇండియా సొసైటీపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆ సొసైటీకి విదేశీ నిధులు కూడా నిలిపేసినట్లు సమాచారం. ఇలాంటి వరుస పరిణామాలు క్రిస్టినా దంపతులకు ఇబ్బందికరంగా మారాయి.