బుర్ఖా లేదా నిఖాబ్ మహిళల అణచివేతకు చిహ్నాలు

హిజాబ్, బుర్ఖా లేదా నిఖాబ్ మహిళల అణచివేతకు చిహ్నాలు అని ప్రముఖ బాంగ్లాదేశ్ రచయిత్రి  తస్లీమా స్పష్టం చేశారు.కర్ణాటక రాష్ట్రంలో రాజుకున్న హిజాబ్ వివాదం దేశంలో ఇతర రాష్ట్రాలకు వ్యాపించిన నేపథ్యంలో తస్లీమా నస్రీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాఠశాలలు, కళాశాలల్లో యూనిఫాం డ్రెస్ కోడ్ ప్రతిపాదన గురించి తస్లీమా నస్రీన్ మాట్లాడుతూ, ‘‘విద్యా హక్కు మతానికి సంబంధించిన హక్కు అని నేను నమ్ముతున్నాను’’ అని ఆమె తెలిపారు.
“హిజాబ్‌ను 7వ శతాబ్దంలో కొంతమంది స్త్రీద్వేషులు పరిచయం చేశారు, ఎందుకంటే ఆ సమయంలో స్త్రీలను లైంగిక వస్తువులుగా పరిగణించేవారు. పురుషులు స్త్రీలను చూస్తే, పురుషులకు లైంగిక కోరిక కలుగుతుందని వారు నమ్ముతారు. కాబట్టి మహిళలు హిజాబ్ లేదా బురఖా ధరించాలి. వారు పురుషుల నుంచి తమను తాము దాచుకోవాలి” అని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా పేర్కొన్నారు.
అయితే నేటి  ఆధునిక సమాజంలో  స్త్రీలు పురుషులతో సమానమని, కాబట్టి హిజాబ్ లేదా నిఖాబ్ లేదా బురఖా అణచివేతకు చిహ్నాలని తస్లీమా చెప్పారు. మతం కంటే విద్యే ముఖ్యమని లౌకిక సమాజంలో సెక్యులర్ డ్రెస్ కోడ్ ఉండాలని ఆమె తేల్చి చెప్పారు.ఒక వ్యక్తి యొక్క గుర్తింపు వారి మతపరమైన గుర్తింపుగా ఉండకూడదని తస్లీమా నస్రీన్ వివరించారు.
 
 ముస్లిం మహిళలపై బలవంతంగా రుద్దుతున్నారు
 
 హిజాబ్‌ను ముస్లిం మహిళలపై బలవంతంగా రుద్దుతున్నారని, దానిని ఎవరూ ఇష్టపడి ధరించరని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ట్రిపుల్ తలాక్‌‌ను ఎవరైనా ఇష్టపడి అంగీకరించారా? అని ప్రశ్నించారు. ఆ ఆడబిడ్డలను, అక్కచెల్లెళ్ళను అడగండని సూచించారు. 
 
వారి కన్నీటిని తాను చూశానని చెబుతూ, వారు తమ కష్టాలను చెప్పుకుంటూ ఉంటే, వారి బంధువులు కన్నీరు కార్చేవారని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జౌన్‌పూర్ మహిళ ధన్యవాదాలు తెలిపారని గుర్తు చేశారు. వ్యక్తిగత వస్త్రధారణ ఆ వ్యక్తి ఇష్టంపై ఆధారపడుతుందని చెప్పారు. 
 
 తాను తనకు నచ్చినదానిని ఇతరులపై రుద్దలేదని యోగి స్పష్టం చేశారు. ‘‘కాషాయం ధరించాలని నా కార్యాలయంలో పని చేసేవారిని నేను కోరగలనా? నా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ విధంగా చెప్పగలనా? నేను అలా చేయలేను. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉండాలి. సంస్థలో అయితే క్రమశిక్షణ ఉండాలి’’ అని ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.
 
హిజాబ్ పట్ల ప్రజ్ఞాసింగ్ అభ్యంతరం 
 
కాగా, విద్యాసంస్థల్లో యువతులు, బాలికలు హిజాబ్ ధరించడంపై భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజలను ఉద్ధేశించి ప్రగ్యాసింగ్ మాట్లాడుతూ  భారత్‌లో హిజాబ్ ధరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.  ఇంట్లో ఇబ్బందులు ఎదుర్కొనే వారు ఇళ్లలో హిజాబ్ ధరించాలని ఆమె కోరారు.
విద్యార్థులు స్కూల్‌కి వెళ్లేటప్పుడు స్కూల్ యూనిఫాం ధరించి విద్యా సంస్థల క్రమశిక్షణ పాటించాలని ఆమె కోరారు. గురుకుల శిష్యులు కాషాయ కండువా ధరిస్తుంటారని ఆమె చెప్పారహిజాబ్ నెరిసిన వెంట్రుకలను దాచుకోవడానికి ఉపయోగిస్తారని ఆమె పేర్కొన్నారు.‘‘హిజాబ్ ఒక పర్దా. మిమ్మల్ని చెడు దృష్టితో చూసే వారిపై పర్దాను ఉపయోగించాలి. కానీ హిందువులు స్త్రీలను పూజించినందున వారిని చెడు దృష్టితో చూడరు’’ అని ప్రగ్యాసింగ్ చెప్పారు.
‘‘ఇక్కడ స్త్రీలను పూజించడం సనాతన సంస్కృతి. స్త్రీల స్థానానికి ప్రాధాన్యం ఉన్న ఈ దేశంలో హిజాబ్ ధరించడం అవసరమా? భారతదేశంలో హిజాబ్ ధరించాల్సిన అవసరం లేదు.’’ అని బీజేపీ ఎంపీ వివరించారు.‘‘మదర్సాలలో హిజాబ్ ధరించండి. కానీ మీరు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలల క్రమశిక్షణకు భంగం కలిగిస్తే.. దానిని సహించేది లేదు’’ అని ప్రగ్యా సింగ్ ఠాకూర్ హెచ్చరించారు.