యుపిలో కేంద్ర మంత్రిపై దాడి … ఇద్దరి అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని కర్హల్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి, కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి సత్యాపాల్ సింగ్ బఘెల్‌ కాన్వాయ్‌పై మంగళవారం రాత్రి దాడి జరిగింది. సుమారు 30 మంది వ్యక్తులు రాళ్లు, కర్రలతో దాడి జరిపారు. 
 
ఈ దాడి జరిగిన ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కర్హల్ పోలీస్ స్టేషన్‌లో బఘెల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. బఘెల్ ఫిర్యాదు చేసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు యూపీ ఏడీజీ (శాంతిభద్రతలు) ప్రశాంత్ కుమార్  తెలిపారు.
 
కర్హల్‌లోని అత్తికుల్లాపూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం బఘెల్ ప్రచారానికి వెళ్లిన సమయంలో కొందరు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఆయన కారు అద్దాలు పగిలినప్పటికీ ఆయన గాయపడకుండా బయటపడ్డారు. 
 
ఇక్కడి నుండి పోటీచేస్తున్న సమాజవాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పై ఆయన బిజెపి అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. తనను చంపేందుకే ఈ దాడి జరిగిందని, సమాజ్‌వాదీ అనుకూల నినాదాలు చేస్తూ కొందరు రాళ్లదాడి జరిపారని ఆయన చెప్పారు. కర్హల్‌లో బీజేపీకి లభిస్తున్న ఆదరణ చూసి అఖిలేష్‌ యాదవ్‌కు భయం పట్టుకుందని ఆరోపించారు.
సీఐఎస్ఎఫ్ జవాన్లు తన ప్రాణాలను కాపాడారని చెప్పారు. బూత్‌లు క్యాప్చరింగ్ చేసి ఎన్నికల్లో నెగ్గాలని అఖిలేష్ అనుకుంటున్నట్టు ఆరోపించారు. కాగా, ఈ దాడి ఘటన నేపథ్యంలో ప్రస్తుతం బఘెల్‌కు కల్పిస్తున్న ‘వైప్లస్’ కేటగిరి స్థానే ‘జడ్’ కేటగిరి భద్రతను కేంద్ర హోం శాఖ కల్పించింది.
 
23 మంది బిజెపి అభ్యర్థులకు కేంద్రం భద్రత 
ఉత్తరప్రదేశ్, పంజాబ్‌‌‌లో ఎన్నికల బరిలో ఉన్న 23 మంది బీజేపీ అభ్యర్థులు, నేతలకు కేంద్ర హోం శాఖ అదనపు భద్రత కల్పించింది. రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ఈ అదనపు భద్రత కొనసాగుతుంది. పంజాబ్‌లో ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసేందుకు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ చురుకుగా పావులు కదుపుతోందన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో కేంద్రం ఈ తాజా నిర్ణయం తీసుకుంది. 
 
ఐఎస్ఎస్ ‌ప్రేరేపిత సిక్కు ఉగ్రవాద సంస్థలు పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల ర్యాలీలను, కొందరు నేతలు, వీఐపీలను లక్ష్యంగా చేసుకునే అకాశాలున్నాయంటూ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తెలిపాయి. 
బీజేపీ అభ్యర్థి-కేంద్ర మంత్రి ఎస్‌పీఎస్ బఘెల్‌కు ఉత్తరప్రదేశ్‌లో సీఐఎస్ఎఫ్ ద్వారా ‘జడ్’ కేటగిరి భద్రత కల్పించారు. బీజేపీ మరో ఎంపీ డాక్టర్ రమేష్ చంద్‌కు ‘ఎక్స్’ కేటగిరి సెక్యూరీటీ ఇచ్చారు. పంజాబ్‌లో పోటీ చేస్తున్న 21 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ‘వై’ కేటగిరి భద్రతను కల్పించారు.
వీరిలో అవతార్ సింగ్ జీరా, నిమిష టి.మెహతా, పర్మీందర్ సింగ్ థిండ్సా, సర్దార్ కన్వర్ వీర్ సింగ్ తోగ్రా, సర్దార్ డిదర్ సింగ్ భట్టి, సర్దార్ గుర్‌ప్రీత్ సింగ్ భట్టి, సర్దార్ హరియట్ కమల్ ఉన్నారు. సుఖ్విందర్ సింగ్ బింద్రాకు ‘వై ప్లస్’ కేటగిరి భద్రత కల్పించారు.
కాగా, ఇప్పటికే పంజాబ్‌లోని పలువురు ఆర్ఎస్ఎస్ నతలు, ఇతర పరివార్ సంస్థల నేతలకు వీఐపీ సెక్యూరిటీ కవర్‌ను కేంద్ర హోం శాఖ కల్పించింది. ఇటీవలే కేంద్ర హోం మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఢిల్లీ, పంజాబ్‌లలో ఉన్నప్పుడు భద్రతా కేటగిరిని ‘వై’ నుంచి ‘జడ్‌’ కేటగిరికి కేంద్ర హోం శాఖ పెంచింది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జిగా షెకావత్ ఉన్నారు. బీజేపీలో చైరిన అకాలీ దళ్ యూత్ నేత పర్మీందర్ సింగ్ బ్రార్, మంజిందర్ సింగ్ సిర్సాకు ‘జడ్’ కేటగిరి భద్రత కల్పించగా, గుర్మీత్ సింగ్ సోధికి కల్పించిన ‘వై’ కేటగిరి భద్రతను ‘జడ్’ కేటగిరికి పెంచారు. సోధి గత డిసెంబర్‌లో సిర్సాతో కలిసి బీజేపీలో చేరారు.