కేజ్రీవాల్ ప్రభుత్వంపై 51 శాతం మంది అసంతృప్తి 

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కరొనా, కాలుష్యంపై వ్యవహరిస్తున్న తీరు పట్ల దాదాపు 51 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 2020లో ఏర్పాటైన ఈ ప్రభుత్వం త్వరలో రెండేళ్ళ పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతోంది. 

ఈ నేపథ్యంలో లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలోని 11 జిల్లాలకు చెందిన 37,500 మంది పాల్గొన్నారు. వీరిలో 67 శాతం మంది పురుషులు కాగా, 33 శాతం మంది మహిళలు.

ప్రతి ముగ్గురిలో ఒకరు మాత్రమే ఈ ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పారు. గడచిన రెండేళ్ళలో కరోనా మహమ్మారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపట్ల కేవలం 32 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు.

ముఖ్యంగా రెండో ప్రభంజనం సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు అత్యంత దయనీయంగా ఉన్నాయని 51 శాతం మంది చెప్పారు. కాలుష్య నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు బాగున్నాయని 21 శాతం మంది చెప్పగా, వాతావరణాన్ని మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యల పట్ల 51 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

గత రెండేళ్ళలో అవినీతిని కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపట్ల 31 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ 45 శాతం మంది ఈ చర్యలు దయనీయంగా ఉన్నాయని పేర్కొన్నారు.

కరోనా రెండో ప్రభంజనం సమయంలో కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి. రోగుల సంఖ్య పెరగడంతో ఆసుపత్రులు, వైద్య సిబ్బందిపై మితిమీరిన భారం పడింది. ఆసుపత్రి పడకలు, ఆక్సిజన్ కొరత ఏర్పడింది. రోగుల బంధువులు కోవిడ్ మందుల కోసం విపరీతంగా శ్రమించవలసి వచ్చింది.