అజిత్ దోవల్ ఇంట్లోకి చొరబాటుకు వ్యక్తి యత్నం

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నివాసంలోకి బలవంతంగా చొరబడేందుకు ప్రయత్నించిన బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. బుధవారం ఉదయం జరిగిన ఈ సంఘటనతో దేశ రాజధానిలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. 

సెంట్రల్ ఢిల్లీలో పటిష్టమైన భద్రతతో ఉండే దోవల్ నివాసంలోకి ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఎరుపు రంగు ఒంటరిగా ఎస్‌యువి డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఒక వ్యక్తి బలవంతంగా లోపలకు ప్రవేశించేందుకు ప్రయత్నించాడు.

 ప్రవేశ ద్వారం వద్దనే భద్రతా దళాలు ఆ కారును అడ్డుకున్నాయి. బలవంతంగా లోపలకు చొరబడేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

దోవల్‌కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను ప్రభుత్వం అందచేస్తోంది. ఈ సంఘటన జరిగిన సమయంలో దోవల్ ఇంట్లోనే ఉన్నారు. తమ అదుపులో ఉన్న ఆ వ్యక్తిని సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది అనంతరం పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తిని బెంగళూరుకు చెందిన శాంతను రెడ్డిగా గుర్తించారు. 

అతని మానసిక పరిస్థితి స్థిరంగా లేదని పోలీసులు భావిస్తున్నారు. నోయిడాలో ఆ కారును అతను అద్దెకు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు అతను సమాధానం ఇచ్చే పరిస్థితిలో లేడని, అతని మానసిక స్థితి బాగాలేదని అధికారులు తెలిపారు.