హిజాబ్ పై ఇస్లామిక్ దేశాల వాఖ్యలు ఖండించిన భారత్

కర్ణాటకలో హిజాబ్ వివాదం నేపథ్యంలో ఇస్లామిక్ సహకార సంఘం (ఓఐసీ) చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలు ప్రేరేపితమని, తప్పుదోవపట్టించేవని తెలిపింది. భారత దేశ వ్యతిరేక ఎజెండాతో ఓఐసీని స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగపరుస్తున్నారని మండిపడింది. 
భారత దేశంలో ముస్లింలపై దాడులు నిరంతరం జరుగుతున్నాయని ఆరోపిస్తూ, అంతర్జాతీయ సమాజం తగిన చర్యలు తీసుకోవాలని ఓఐసీ పిలుపునిచ్చింది. జెడ్డాలోని ఈ సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి సోమవారం విడుదలైన ఓ ప్రకటనలో, భారత దేశంలో జరుగుతున్న సంఘటనల పట్ల ఓఐసీ జనరల్ సెక్రటేరియట్ తీవ్ర ఆందోళన చెందుతోందని తెలిపింది.
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో హిందుత్వవాదులు ముస్లింల ఊచకోతకు బహిరంగంగా పిలుపునిచ్చారని, సోషల్ మీడియా సైట్లలో ముస్లిం మహిళలను వేధిస్తున్నారని, కర్ణాటకలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై నిషేధం విదించారని, ఈ సంఘటనలు ఆందోళనకరమని పేర్కొంది. 
 
ఈ నేపథ్యంలో భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి  విడుదల చేసిన ప్రకటనలో, భారత దేశానికి సంబంధించిన అంశాలపై ఓఐసీ జనరల్ సెక్రటేరియట్ నుంచి ప్రేరేపిత, తప్పుదోవపట్టించే మరొక ప్రకటనను గమనించామని తెలిపారు. భారత దేశంలోని సమస్యలను భారత దేశ రాజ్యాంగ నిబంధనావళి, యంత్రాంగాలకు లోబడి, అదేవిధంగా ప్రజాస్వామిక నియమాలకు అనుగుణంగా పరిశీలించి, పరిష్కరించుకుంటామని తెలిపారు.