శివ‌రాజ్ సింగ్ చౌహాన్ కి క‌రోనా

బిజెపి సీనియ‌ర్ నేత‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి  శివ‌రాజ్ సింగ్ చౌహాన్ కి క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా ట్వీట్ చేశారు. తేలికపాటి లక్షణాలు ఉన్నందున ఆయన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటున్నారు.

 రాబోయే రోజుల్లో అన్ని పనులను వర్చువల్‌గా చేస్తానని… బుధవారం, సంత్ శిరోమణి రవిదాస్ జయంతి కార్యక్రమంలో కూడా తాను వర్చువల్‌‌గా పాల్గొంటానని శివరాజ్‌సింగ్ చౌహాన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంద‌రూ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆయన కోరారు. 
 
కాగా, దేశంలో కరోనా కేసులు నిన్నటి కంటే స్వల్పంగా పెరిగాయి. దేశంలో కొత్తగా 30 వేల 615 కరోనా కేసులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే 11 శాతం కేసులు పెరిగాయి. కరోనా నుంచి మరో 82 వేల 988 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో కరోనాతో 514 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 
 
దేశంలో 4 లక్షలకు దిగువన కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 3 లక్షల 70 వేల 240 యాక్టివ్ కేసులున్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 2.45 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకు కరోనా నుంచి 4 కోట్ల 18 లక్షల మందికి పైగా కోలుకున్నాయి. ఇప్పటివరకు 173కోట్ల 86 లక్షలక పైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది కేంద్రం.
కరోనా కేసులు క్రమంగా తగ్గుతుండడంతో ఒమైక్రాన్‌ వేరియంట్‌ కారణాన దేశంలో వచ్చిన మూడో వేవ్‌ సద్దుమణిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైరస్‌ ఎండెమిక్‌ దశకు చేరిందని అంచనా వేస్తున్నారు. వరుసగా 9వ రోజూ కొత్త కేసులు లక్షలోపే నమోదవడం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది.
అయితే, అప్పుడే అంతా అయిపోయినట్లు అనుకోవద్దని అంటున్నారు ప్రముఖ వైరాల జిస్టు డాక్టర్‌ జాకబ్‌ జాన్‌. స్థిరంగా నాలుగు వారాల పాటు కేసులు తక్కువ సంఖ్యలో వచ్చినప్పుడే ఎండెమిక్‌కు వచ్చినట్లని స్పష్టం చేస్తున్నారు.
ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చి సెంటర్‌ అఫ్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఇన్‌ వైరాలజీ మాజీ డైరెక్టర్‌ అయిన డాక్టర్‌ జాకబ్‌.. ఎండెమిక్‌ దశ నెలల పాటు కొనసాగుతుందని వివరిస్తున్నారు. ఒమైక్రాన్‌ వంటి వ్యాప్తి వేగం ఎక్కువగా ఉన్న, డెల్టా వంటి అతి ప్రమాదకర వేరియంట్లు ఉద్భవించేందుకు అవకాశం లేదని చెప్పారు. ఒమైక్రాన్‌ వ్యాప్తి వేగంగా క్షీణిస్తోందని కొద్ది రోజుల్లో కేసులు బాగా తగ్గొచ్చని పేర్కొన్నారు. ఆ తర్వాతనే ఎండెమికా? కాదా? అని చెప్పవచ్చని తెలిపారు.