విద్యార్థులకు మద్దతుగా ఉపాధ్యాయులూ హిజాబ్!

కర్ణాటక హిజాబ్‌ వివాదం కొత్త మలుపు తీసుకొంది. విద్యార్థినులకు మద్దతుగా పలు పాఠశాలల్లో ముస్లిం ఉపాధ్యాయినులు సైతం హిజాబ్‌తో వస్తున్నారు. మరోవైపు మంగళవారం కూడా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్థీ నేతృత్వంలోని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం హిజాబ్‌పై విచారణ కొనసాగించింది.
హిజాబ్‌ ముస్లిం సంప్రదాయంలో భాగమని బాలికల తరఫు న్యాయవాదులు పలు ఆధారాలను ధర్మాసనం ముందుంచారు. కొందరు రాజకీయ లబ్ధి కోసం దీన్ని వినియోగించుకుంటున్నారని, దీనిపై త్వరగా తేల్చాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. తదుపరి విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
శాసనసభలోనూ మంగళవారం ఈ అంశం ప్రతిధ్వనించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అందరూ పాటించాల్సిందేనని హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర స్పష్టం చేశారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా హిజాబ్‌పై రెండోరోజు కూడా ఉపాధ్యాయులు, విద్యార్థినుల మధ్య పలుచోట్ల వాగ్వాదం జరిగింది.
 
కొడగు జిల్లాలోని ఓ పాఠశాలలో బుర్ఖా తొలగించేందుకు నిరాకరించిన 30 మంది విద్యార్థినులను గేటు వద్ద నుంచి వెనక్కి పంపించేశారు. శివమొగ్గ జిల్లాలో 12 మందిని వెనక్కి పంపారు. మండ్య, ఉడుపి జిల్లాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 
 
ఇక బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పీయూ(ఇంటర్మీడియెట్‌) కళాశాలలు తెరచుకోనున్న నేపథ్యంలో వాటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.  హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటకలోని బాగల్ కోట్, బెంగళూరు, చిక్కబళ్లాపూర్, గదగ్, షిమోగ, తూమ్ కూర్, మైసూరు, ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాల్లో ముందుజాగ్రత్త చర్యగా 144 సెక్షన్ ను విధించారు. 
 
శివమొగ్గ నగరంలో హిజాబ్ వివాదం నేపథ్యంలో ఎస్ఎస్ఎల్‌సీ ప్రాథమిక పరీక్షలను ముస్లిం వి ద్యార్థినులు బహిష్కరించారు.కళాశాలల వద్ద ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.