ఏబీజీ షిప్‌యార్డ్‌ మాజీ సీఎండీపై లుకౌట్‌ నోటీసులు

ఏబీజీ షిప్‌యార్డ్‌ రుణాల కుంభకోణం కేసులో ఆ సంస్థ మాజీ సీఎండీ రిషి కమలేశ్‌ అగర్వాల్‌తోపాటు మరో 8 మంది నిందితులపై లుకౌట్‌ నోటీసులు జారీచేసినట్టు సీబీఐ వెల్లడించింది. నిందితులందరూ భారత్‌లోనే ఉన్నారని, దేశం విడిచి వెళ్లే వీలులేకుండా నోటీసులు జారీచేశామని సీబీఐ పేర్కొంది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్‌లను అలర్ట్‌ చేసినట్టు వెల్లడించింది.
కాగా… ఏబీజీ షిప్‌యార్డ్‌ బ్యాంకు ఖాతాను కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పుడే… అంటే 2013లోనే నిరర్థక ఆస్తిగా ప్రకటించారని సీబీఐ తెలిపింది. ఈ మేరకు ఎస్బీఐ ప్రకటించిందని వివరించింది.
ఎస్బీఐ ఫిర్యాదు ప్రకారం… రూ.22,842 కోట్ల నిరర్థక ఆస్తులను ప్రకటించారని, ఈ రుణాల్లో అధిక భాగం ఐసీఐసీఐ నేతృత్వంలోని 28 బ్యాంకుల కన్సార్షియం 2005 నుంచి 2012 మధ్య కాలంలోనే పంపిణీ చేసిందని, ఇందులో ఎస్బీఐ కూడా ఉందని మంగళవారం ఓ ప్రకటనలో సీబీఐ తెలిపింది.
అయితే, 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే పలు బ్యాంకులు ఏబీజీ షిప్‌యార్డ్‌ ఖాతాను మోసపూరిత ఖాతాగా ప్రకటించడం విశేషం. గుజరాత్‌కు చెందిన ఏబీజీ షిప్‌యార్డ్‌ కంపెనీ… దేశంలోని పలు బ్యాంకుల నుంచి సుమారు రూ.23వేల కోట్ల మేరకు రుణాలు తీసుకుని, ఆ సొమ్మును ఇతర అవసరాలను మళ్లించినట్టు బయటపడటంతో సీబీఐ దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే.