చైనీస్ టెలికాం కంపెనీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

చైనీస్ టెలికాం కంపెనీ  ‘హువావే   కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది.  ఆదాయపు పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ, హర్యానాలోని గురుగ్రామ్, కర్ణాటకలోని బెంగళూరులలో ఈ సోదాలు జరిగినట్లు తెలిపింది. 
 
ఈ కంపెనీకి చెందిన భారతీయ, విదేశీ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, ఖాతా పుస్తకాలు, కంపెనీ రికార్డులను అధికారులు పరిశీలించినట్లు పేర్కొంది. కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు కూడా పేర్కొంది. 
 
ఇదిలావుండగా, ఈ వార్తలపై ‘హువావే  స్పందిస్తూ, తమ కార్యకలాపాలు చట్టానికి అనుగుణంగా జరుగుతున్నాయని ఓ ప్రకటనలో తెలిపింది. తమ కార్యాలయానికి ఆదాయపు పన్ను శాఖ అధికారుల బృందం వచ్చినట్లు, కొందరు సిబ్బందితో ఈ అధికారుల బృందం సమావేశమైనట్లు  తమకు సమాచారం అందిందని తెలిపింది. 
 
భారత దేశంలో తమ కార్యకలాపాలు అన్ని చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నట్లు ధీమా వ్యక్తం చేసింది. మరింత సమాచారం కోసం సంబంధిత ప్రభుత్వ శాఖలను సంప్రదిస్తామని చెప్పింది. నియమ, నిబంధనల ప్రకారం సంపూర్ణంగా సహకరిస్తామని తెలిపింది. 
 
ఇదిలావుండగా, ‘హువావే’ ని 5జి ట్రయల్స్ నుంచి భారత ప్రభుత్వం పక్కనబెట్టింది. చైనా అనుబంధంగల మరొక 54 యాప్‌లను ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిషేధించిన సంగతి తెలిసిందే. భారత దేశంలో మొబైల్ యాప్‌ల ద్వారా తక్షణ రుణాలు ఇస్తున్న చైనా నియంత్రణగల కంపెనీలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల ఆస్తులను స్తంభింపజేసింది.