భక్తి, సమానత కోసం రామానుజులవారు విశేష కృషి

భక్తి, సమానత కోసం రామానుజులవారు విశేష కృషి చేశారుని, భక్తితో ముక్తి లభిస్తుందని రామానుజులవారు నిరూపించారని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ తెలిపారు.  శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా ముచ్చింతల్‌కు వచ్చిన రాష్ట్రపతి  శ్రీరామానుజాచార్యుల 120 కిలోల (120 ఏళ్లకు గుర్తుగా) స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రామానుజ భారీ విగ్రహాన్ని సందర్శించి  దేశంలో కొత్త చరిత్ర మొదలైందని చెప్పారు. 
 
ముచ్చింతల్ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని అభిలాష వ్యక్తం చేశారు. సమతాస్ఫూర్తి కేంద్రంలో 108 దివ్యక్షేత్రాలకు ప్రాణప్రతిష్ఠ జరిగింది. రామానుజాచార్యుల బోధనలకు అంబేద్కర్ ప్రభావితం అయ్యారని చెబుతూ వసుదైక కుటుంబం అనే భావన రామానుజుల నుంచే వచ్చిందని పేర్కొన్నారు.  
 
అంటరానితనం నిషేధం, సమానత్వం అంశాలకు.. రామానుజా చార్యుల బోధనలే స్ఫూర్తినిచ్చాయని రామ్‌నాథ్‌ తెలిపారు. ‘‘స్వర్ణ రామానుజ విగ్రహాన్ని లోకాయుక్తం చేయడం నా అదృష్టం. భక్తి, సమానత కోసం రామానుజులవారు విశేష కృషి చేశారు. భక్తితో ముక్తి లభిస్తుందని రామానుజులవారు నిరూపించారు” అని కొనియాడారు.
 రామానుజాచార్యులు భక్తితో భారతీయులను ఏకతాటిపైకి తె చ్చిన మహనీయులని తెలుపుతూ సమతామూర్తి విగ్రహ ఏర్పాటు స్ఫూర్తితో లోక కల్యాణం కోసం కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహం లోకార్పణ చేయడంతో దేశంలో నవశకం ప్రారంభమైందని పేర్కొన్నారు. తెలంగాణలో కొత్త సాంస్కృతిక జీవనం మొదలైందని తెలిపారు. శ్రీరామనగరం అద్వైత, సమతా క్షేత్రంగా విలసిల్లుతుందని అభిలాష వ్యక్తం చేశారు. 
 
 అంబేద్కర్, గాంధీజీ, స్వామీ వివేకానంద రామానుజాచార్యుల స్ఫూర్తితోనే సమాజం లో అసమానతలపై పోరాడారని, అంబేద్కర్‌కు రామానుజాచార్యుల బోధనలే స్ఫూర్తినిచ్చాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. రాజ్యాంగంలో అంటరానితనం నిషేధం, సమానత్వం అంశాలను చేర్చేందుకు రామానుజాచార్యుల బోధనలే స్ఫూర్తినిచ్చాయని చెప్పారు. 
 
మహారాష్ట్రలోని అంబేద్కర్ స్వస్థలం తరహాలోనే శ్రీరామనగరంలో సమానత్వం వెల్లువిరుస్తుందని గుర్తు చేశారు. రామనుజాచార్యుల చరిత్ర చదివాకే గాంధీజీ పోరాటం మొదలైందని కోవింద్ తెలిపారు. గాంధీజీపై రామానుజాచార్యుల బోధనల ప్రభావం ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వివరించారు.
 
 వెయ్యేళ్ల క్రితమే కుల వివక్షను పారదోలేందుకు శ్రీభగద్రామానుజాచార్యులు కృషిచేశారని చిన జీయర్ స్వామీ పేర్కొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌జీ కుటుంబసమేతంగా విచ్చేసి రామానుజాచార్యుల సువర్ణమూర్తిని ఆవిష్కరించి లోకార్పణ చేయడం ఆనందంగా ఉందని చెప్పారు.
 
 కులాలకతీతంగా భక్తులు ఇచ్చిన విరాళాలతో రామానుజాచార్యుల భారీ విగ్రహం ఏర్పాటు చేశామని, రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా కొనసాగుతున్న సమయంలో కాశీ పునరుద్ధరణ జరిగిందని, అలాగే అయోధ్యలో రామ మందిరం నిర్మాణమవుతోందని సంతోషం వ్యక్తం చేశారు. 
అంతకు ముందు రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో రాష్ట్రపతి దంపతులు పాల్గొన్నారు. రామానుజుల స్వర్ణమూర్తిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ లోకార్పణం చేశారు. స్వర్ణ రామానుజుల విగ్రహానికి  రామ్‌నాథ్‌ తొలిపూజ చేశారు. 
 
ఈ సందర్భంగా రామానుజ విగ్రహ ఆవిష్కరణపై రాష్ట్రపతికి చినజీయర్ స్వామి వివరించారు.  అంతకు ముందు మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై స్వాగతం పలికారు. అనంతరం హెలికాప్టర్ లో ముచ్చింతల్ ఆశ్రమానికి చేరుకున్నారు.
కాగా, రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో  భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పోలీసులు. 7 వేల మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఒంటి గంట నుంచి సాధారణ భక్తులను అనుమతించలేదు.