బిజెపి కూటమి మాత్రమే పంజాబ్ లో డ్రగ్స్ అంతం చేస్తుంది 

ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, ఆప్‌ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ, బీజేపీ నేతృత్వంలోని కూటమి మాత్రమే పంజాబ్‌ను సురక్షితమని, రాష్ట్రం నుంచి డ్రగ్స్‌ను నిర్మూలించగలదని, అక్రమ మత మార్పిడులను అరికట్టగలదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
బిజెపి నేతృత్యంలోని ప్రభుత్వం అధికారంలోకి వస్తే  ఐదేళ్లలో డ్రగ్స్ ను పంజాబ్ నుండి తరిమి కొడతామని హామీ ఇచ్చారు.  ఫిబ్రవరి 20న జరిగే  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం లుధియానాలో తన  మొదటి బహిరంగ ర్యాలీలో మాట్లాడుతూ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
ఢిల్లీలో సిక్కులను చంపడంలో కాంగ్రెస్ నాయకుల ప్రమేయం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో సిక్కులు, హిందువుల మత మార్పిడి సమస్యను ప్రస్తావిస్తూ  దీనిని కట్టడి చేయడంలో చన్నీ నేతృత్యంలోని ప్రభుత్వం విఫలమైనదని   మండిపడ్డారు.
 పంజాబ్‌లో సిక్కులు, హిందువుల మత మార్పిడి పెద్ద సమస్య అని పేర్కొంటూ  “ఈ మత మార్పిడులను చన్నీ సాహెబ్ ఆపలేరు,” అని స్పష్టం చేశారు, ఆప్ కూడా వాటిని ఆపలేదని, కేవలం బిజెపి మాత్రమే ఆపగలదని చెప్పారు. స్వతంత్ర పోరాటంలో పంజాబ్ ప్రజలు చేసిన త్యాగాలను షా గుర్తుచేసుకుంటూ, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి రాష్ట్రం ఎంతగానో సహకరించిందని ప్రశంసించారు.
కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి చన్నీపై షా మాట్లాడుతూ, “చన్నీ సాహెబ్, మీరు మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కలలు కంటున్నారు. ప్రధాని మార్గాన్ని కాపాడుకోలేని వ్యక్తి పంజాబ్‌ను కాపాడుకోగలరా?” అని ప్రశ్నించారు.
జనవరి 5న ఫిరోజ్‌పూర్‌లో కొంతమంది నిరసనకారులు అడ్డుకోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌లోని ఫ్లైఓవర్‌పై 15-20 నిమిషాల పాటు ఇరుక్కుపోయి, అమరవీరుల కార్యక్రమంలో పాల్గొనకుండా తిరిగి వచ్చిన “పెద్ద భద్రతా లోపం” గురించి ఆయన ప్రస్తావించారు.
 ‘ప్రధానమంత్రికి భద్రత కల్పించలేకపోతే పంజాబ్‌ను ఎలా కాపాడుకోగలం.. చన్నీజీ?” అంటూ  ఒక్క సెకను కూడా పరిపాలన సాగించే హక్కు ఆయనకు లేదని స్పష్టం చేశారు. చన్నీ నాయకత్వంలో పంజాబ్ సురక్షితంగా ఉండగలదా అని ప్రజలను అడుగుతూ “ఒక దేశం నడపాలి, కామెడీ చిత్రం కాదు” అని ఎద్దేవా చేశారు.
ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ “ఓటు రాజకీయాలు” ఆడుతున్నారని నిందించిన విమర్శించారు.  ఢిల్లీ ముఖ్యమంత్రికి భద్రతతో సంబంధం లేదని అంటూ. “గత ఎన్నికలను గుర్తుంచుకోవాలా? వారికి మార్గం ఉంటే, వారు ఉగ్రవాదులందరినీ పునరుజ్జీవింపజేస్తారు” అని షా మండిపడ్డారు. పంజాబ్‌కు భద్రత కల్పించగలరా? అని ఆయన కేజ్రీవాల్ ను ప్రశ్నించారు.
ఉరీ, పుల్వామాలో ఉగ్రదాడుల తర్వాత పాకిస్థాన్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌, వైమానిక దాడుల గురించి ప్రజలకు గుర్తు చేస్తూ,  ఎన్‌డీఏ నేతృత్వంలోని కూటమి మాత్రమే పంజాబ్‌ను కాపాడుకోగలదని స్పష్టం చేశారు. యూపీఏ హయాంలో సరిహద్దుల నుంచి ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించేవారని గుర్తు చేశారు.
1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల అంశాన్ని లేవనెత్తిన ఆయన, “ఢిల్లీలో సిక్కులను చంపడం ద్వారా కాంగ్రెస్ పాపం” చేసిందని ఆరోపించారు. “సిక్కు వ్యతిరేక అల్లర్లను ఎవరూ మరచిపోలేరు. వాటిని గుర్తు చేసుకుంటే నా కళ్లు చెమర్చాయి. దానికి చన్నీ వివరణ ఇవ్వాలి” అని షా డిమాండ్  చేశారు.
అల్లర్లలో పాల్గొన్న వారిని కటకటాల వెనక్కి నెట్టింది బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వమని కూడా ఆయన గుర్తు చేశారు. పంజాబ్ చాలా ప్రయోగాలు చేసిందని, చెబుతూ కాంగ్రెస్,  అకాలీలకు రాష్ట్రం చాలా అవకాశాలు ఇచ్చిందని, ఆప్ కు  ఓటు వేయకుండా ప్రజలను హెచ్చరించిందని తెలిపారు. అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వడానికి అర్హత లేదని స్పష్టం చేశారు.
పంజాబ్ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. “మేము ‘నవ’ (కొత్త) పంజాబ్‌ను నిర్మిస్తాము,” అని షా భరోసా ఇచ్చారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన ప్రచారంలో 2020, 2021లో పట్టుబడిన డ్రగ్స్‌ పరిమాణం పదేళ్లలో పట్టుకోగలిగిన దానికంటే ఎక్కువని పేర్కొన్నారు.
 డ్రగ్స్ సమస్యకు ముగింపు పలకడానికి మోదీ చేతులను బలోపేతం చేసి గ్రామాలకు ప్రచారం నిర్వహించే ప్రభుత్వం ఇక్కడ రావాలి’’ అని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల సమస్యను అంతం చేస్తానని కేజ్రీవాల్ ఇచ్చిన హామీ స్పందిస్తూ, “ఢిల్లీని మొత్తం మద్యంలో ముంచి” పంజాబ్‌లో ముప్పును అంతం చేయడం గురించి ఆప్ అధినేత ఎలా మాట్లాడగలరని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో భూసారం క్షీణిస్తోందన్న అంశాన్ని లేవనెత్తిన షా.. పంటల తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.  దేశాన్ని పోషించే భూమి ఇప్పుడు సాగుకు యోగ్యం కాదని, రైతులు తమ భూమిని పరిశీలించాలని కోరారు. పంటల తీరు మార్చుకోకుండా, పంజాబ్‌లో వ్యవసాయం అభివృద్ధి చెందదని పేర్కొన్న షా, కూటమి అధికారంలోకి వస్తే, బీజేపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం పడిపోకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
బిజెపి ఎల్లప్పుడూ సిక్కు సంప్రదాయాలను గౌరవిస్తుందని చెబుతూ  చేస్తూ, గురుగోవింద్ సింగ్ 350వ జయంతిని పురస్కరించుకుని, కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించడం, ‘లంగర్’ను వస్తు సేవల పన్ను లేకుండా చేయడం వంటి మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి వివరించారు.