భారతీయ ఆయుర్వేదంతో నా బిడ్డకు కంటి చూపు

కెన్యా దేశాధ్యక్ష పదవికి నాలుగుసార్లు తలపడి ఎన్నికకాలేకపోయినా.. ప్రజల అధ్యక్షుడిగా పేరుపొందారు.. రైలా అమోలో ఒడింగా. 77 ఏళ్ల ఒడింగా ఆగస్టులో జరిగే ఎన్నికల్లో అయిదోసారి కెన్యా అధ్యక్ష పదవికి తలపడనున్నారు. ఒడింగా పిలుపిస్తే లక్షలాది మంది కెన్యా ప్రజలు వీధుల్లోకి వస్తారు.
ప్రస్తుత అధ్యక్షుడు కెన్యాట్టా పాలనలో ఒడింగా కొన్నేళ్లు ప్రవాసంలో గడిపారు. పలుసార్లు జైలు పాలయ్యారు. ఆయన పెద్ద కుమారుడు హత్యకు గురయ్యారు. కోట్లాది మంది ప్రజలు ఒడింగాను బాబాజీ అని ఆరాధిస్తారు.
ఒకసారి కెన్యా ప్రధానిగా, 15 ఏళ్లపాటు ఎంపీగా ఉన్న ఒడింగా ఢిల్లీకి రాగానే.. కెన్యా రాయబార కార్యాలయంతోపాటు మొత్తం ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల రాయబారులు, భారత విదేశాంగ శాఖ అధికారులు ఆయన గౌరవార్థం విందు ఏర్పాటు చేయడం ఒడింగా ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. ఆదివారం ప్రధాని మోదీని కలిసిన ఒడింగాతో.. ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి ఎ.కృష్ణారావు ఇంటర్వ్యూ విశేషాలు..

భారతదేశంతో మీ అనుబంధం ఎలాంటిది..?

భారతదేశంతో మా కుటుంబానికి చిరకాల అనుబంధం ఉంది. 1953లో మా తండ్రి, కెన్యా తొలి ఉపాధ్యక్షుడు జరమోగి ఒగింగా ఒడింగా..  ఇండియా వచ్చి దేశమంతటా పర్యటించారు. నేనూ భారత్‌లో ఏడుసార్లు పర్యటించాను.
ఢిల్లీ, హైదరాబాద్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌, కొచి వంటి పలు నగరాలకు వెళ్లాను. తెలుగువారైన ఎమెస్కో విజయ్‌కుమార్‌, వ్యాపారవేత్త బైరగోని శ్రీనివాసగౌడ్‌ నా మిత్రులే. 2019లో సతీసమేతంగా తిరుపతి బాలాజీని దర్శించుకోవడం గొప్ప అనుభవం.  ఇంకో అద్భుతం ఏమిటంటే.. కంటి చూపు తిరిగి రాదనుకున్న నా కూతురు రోజ్‌ మేరీకి కేరళలో తీసుకున్న ఆయుర్వేద వైద్యం ద్వారా చూపు వచ్చింది.

మోదీతో మీకున్న సంబంధాలు ఎలాంటివి..?

గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పటి నుంచే ఆయనతో సంబంధాలున్నాయి. వైబ్రంట్‌ గుజరాత్‌ సదస్సుకు నేను హాజరయ్యాను. కెన్యాలో భారతీయులు, ముఖ్యంగా గుజరాతీల పాత్ర ఎంతో ఉంది. మోదీ ప్రధాని అయ్యాక కెన్యాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. కొవిడ్‌ టీకాలను పెద్ద ఎత్తున మాకు పంపించారు.
మీ ఎన్నికల కమిషన్‌ స్వతంత్రంగా పనిచేస్తుందా?
ఎన్నికల కమిషన్‌ కాగితంపైనే స్వతంత్రంగా పనిచేస్తుంది. మా వద్ద కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ఖర్చు ఉంటుంది. మొత్తం వ్యయం 50కోట్ల డాలర్లకు మించే ఉంటుంది.

ఆఫ్రికాలో నియంతృత్వం ఎందుకు ఎక్కువ?

ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో నియంతృత్వం ఉండేది. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. బెర్లిన్‌ గోడ కూలిపోయింది. తూర్పు యూరప్‌ పరిణామాలు ఆఫ్రికాపై కూడా ప్రభావం చూపాయి. కొత్త నాయకత్వాలు వస్తున్నాయి. నియంతృత్వాలపై ప్రతిఘటనలు జరుగుతున్నాయి.

నెల్సన్‌ మండేలాగా ఎవరికి గుర్తింపు ఉంటుంది?

నాకు ఆ గుర్తింపు రావాలనుకుంటున్నాను. నాలుగుసార్లు అఽధ్యక్ష పదవికి పోటీ చేశాను. అక్రమాలు జరగకపోతే మూడుసార్లు గెలిచేవాడిని. ఒకసారి నేను లక్ష ఓట్లతో గెలిచిన తర్వాత కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపేసి, ఫలితాలను తారుమారు చేశారు. 2007 ఎన్నికల్లో అక్రమంగా అధ్యక్షుడిని ప్రకటించడంతో ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారు.

హింసాకాండ జరిగి వెయ్యి మందికిపైగా మరణించారు. అంతర్జాతీయ సంస్థలు, ఆఫ్రికన్‌ యూనియన్‌, ఐక్యరాజ్యసమితి, కోఫీ అన్నన్‌ మఽధ్యవర్తులుగా వ్యవహరించడంతో అధికారం పంచుకునేందుకు ఒప్పందం చేసుకున్నాం. 2008లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాను.

కెన్యాలో పౌర హక్కుల పరిస్థితి..?

కెన్యాలో పౌర హక్కుల పరిస్థితి ఇప్పుడు ఎంతో మెరుగైంది. పత్రికా స్వేచ్ఛ కూడా మెరుగుపడింది. నేను అధ్యక్షుడినైతే ప్రజల స్వేచ్ఛాస్వాతంత్య్రంలకు ప్రాధాన్యం ఇస్తాను.

ఈసారైనా అధ్యక్షుడవుతారా…?

రిగ్గింగ్‌ జరగకపోతే నేనే అధ్యక్షుడయ్యే అవకాశాలున్నాయి. రాజ్యాంగం ప్రకారం మా దేశంలో ఆర్నెల్లు ముందు నుంచే ప్రచారం ప్రారంభమవుతుంది. కెన్యాలో ఆగస్టు 9న ఆరు ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. అధ్యక్ష పదవికి, నేషనల్‌ అసెంబ్లీ (పార్లమెంట్‌), స్థానిక ప్రభుత్వాలు, సెనేట్‌, మహిళా ప్రతినిధులు, గవర్నర్‌ పదవులకు జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి.

ఓటర్లు ఆరు బ్యాలెట్‌ పేపర్లను ఆరు బాక్సుల్లో వేయాల్సి ఉంటుంది. అధ్యక్ష పదవికి హోరాహోరీ పోరు ఉంటుంది. మహిళలకు ప్రత్యేకంగా 30 శాతం సీట్లు కేటాయిస్తారు. మా వద్ద ప్రధాన న్యాయమూర్తి, ఉప న్యాయమూర్తి కూడా మహిళలే.

(ఆంధ్రజ్యోతి నుండి)