అయోధ్యలో గంట మోగగానే వీరంతా అదృశ్యమైపోతారు

ఉత్తర ప్రదేశ్ అభివృద్ధికి అనుకూలంగా లేనివారు జలేసర్‌లో తయారైన గంట అయోధ్య రామాలయంలో మోగడం ప్రారంభించిన వెంటనే అదృశ్యమైపోతారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.  జలేసర్‌లో ఆదివారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ అయోధ్య  రామాలయంలో 2,100 కేజీల బరువైన గంటను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. 
 
 జలేసర్‌లో తయారైన గంటలు దేవాలయాల్లో మోగినపుడు అపవిత్రమైనవన్నీ అదృశ్యమైపోతాయనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో విశేష పాత్ర పోషించిన ఇటావా జిల్లాలో 70 ఏళ్ళకుపైగా సరైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు, వైద్య కళాశాలలు లేకపోవడం చాలా వింతగా ఉంటుందని చెప్పారు. 
 
ప్రస్తుతం స్వాతంత్య్ర సమర యోధురాలు అవంతిబాయ్ లోఢీ పేరు మీద ఓ వైద్య కళాశాలను ఏర్పాటు చేశామని చెప్పడానికి గర్విస్తున్నానని చెప్పారు. 
 
2017కు పూర్వం అధికారంలో ఉన్నవారి మద్దతుగల మాఫియా, నేరగాళ్ళు ఈ జిల్లాపై ఆధిపత్యం ప్రదర్శించేవారని ఆరోపించారు. పేదలు, రైతులు, చిన్నతరహా, మధ్య తరహా వ్యాపార, వాణిజ్య సంస్థలపై కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు సానుభూతి లేదని చెప్పారు. వారి కోసం ఈ పార్టీలు ఏమీ చేయలేదని విమర్శించారు. రైతుల రుణాలను రద్దు చేయలేదని గుర్తు చేశారు. 
 
ఇళ్లు, మరుగుదొడ్లను నిర్మించలేదని, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను కల్పించలేదని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ పార్టీలకు కేవలం మాఫియా, నేరగాళ్ళపై మాత్రమే సానుభూతి ఉందని ధ్వజమెత్తారు.  2017 తర్వాత అలాంటి మాఫియాలు, క్రిమినల్స్‌పై తన ప్రభుత్వం స్పందించిన తీరును, వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్న విషయాన్ని గమనించారా? అని అడిగారు. కరోనా మహమ్మారిపై తన ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని చెప్పారు.  
 
 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కరోనా భూతాన్ని విజయవంతంగా సీసాలో బంధించిందని తెలిపారు. బహిరంగ సభ కోసం వేలాది మంది ఒక చోటకు చేరినప్పటికీ, ఈ వైరస్ ఎక్కడా కనిపించదని స్పష్టం చేశారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉచిత పరీక్షలు, చికిత్సలు, వ్యాక్సిన్లు ఇచ్చినట్లు తెలిపారు. పేదలకు డబుల్ డోస్ రేషన్ ఇచ్చినట్లు చెప్పారు. 
ఉద్యోగులను కాషాయ కండువా ధరించమనవచ్చా!
 
 కాగా, దేశంలో వ్యవస్థ షరియత్, ఇస్లామిక్ చట్టంపై కాదని, భారత రాజ్యాంగంపై ఆధారపడి నడపాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.  ముస్లిం మహిళలకు గౌరవమిస్తూ ప్రధానమంత్రి మోదీ ట్రిపుల్ తలాఖ్ చట్టాన్ని రద్దు చేశారని యోగి గుర్తు చేశారు.తమ వ్యక్తిగత మత విశ్వాసాలను దేశంలో విధించలేమని తేల్చి చెప్పారు. 
 
 యూపీలోని ఉద్యోగులందరూ కాషాయ కండువా ధరించమని నేను అడగవచ్చా అని ప్రశ్నించారు. పాఠశాలల్లో డ్రెస్ కోడ్ తప్పనిసరిగా అమలు చేయాలని సీఎం సూచించారు. ప్రధాని మోదీ హయాంలో ఘజ్వా-ఏ-హింద్ కల సాకారం కాదని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
 
‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ అనే సూత్రంతో దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నడిపిస్తున్నారని.. ఇక్కడ బుజ్జగింపు రాజకీయాలు ఉండవని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.