దమ్ముంటే కేంద్రం అవినీతిని బయట పెట్టు 

కేంద్రం అవినీతి చేసిందని ఆరోపిస్తున్న సీఎం కేసీఆర్  దమ్ముంటే ​కేంద్రం అవినీతిని బయట పెట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎప్పుడు? ఎక్కడ? బయటపెడ్తడో చెప్తే తానే వెళ్తానని చెప్పారు. ఇందుకోసం తానే సభ ఏర్పాటు చేస్తానని తెలిపారు. ‘‘కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు సహరా కుంభకోణంలో పాత్రధారివి నువ్వు కాదా?’’ అని సీఎంను ప్రశ్నించారు.
 
 ‘‘కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌పై వచ్చినన్ని ఆరోపణలు ఎవరి మీదా రాలేదు.. సహారా, ఈఎ్‌సఐ స్కాం ఎవరు చేశారు..? వెలుగుబంటి సూర్యనారాయణను తీసుకువస్తాం.. కేసీఆర్‌ అవినీతి మీద విచారణ ప్రారంభం కాబోతున్నది.. తన పతనం ఆరంభమైందని గ్రహించే కేసీఆర్‌.. తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలిస్తున్నాడు’’ అని ఆరోపించారు.
 
 ‘‘నువ్వే పెద్ద అవినీతిపరుడివి.. కేంద్రం అవినీతి చిట్టా నీ వద్ద ఉందా.. ఆ చిట్టాను ఎప్పుడు తీస్తావో చెప్పు.. దమ్ముంటే వారంలోగా అవినీతిని బయటపెట్టు’’ అంటూ సవాల్‌ విసిరారు.
 
తన అవినీతిపై విచారణ ప్రారంభమైందేమోనని సీఎం కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నడు. తన అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందన్న భయం కేసీఆర్ ను వెంటాడుతోందని ఆయన ఆరోపించారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే కుట్ర చేస్తుండు అని ధ్వజమెత్తారు.
 
‘‘కేసీఆర్.. నువ్వు ఎన్ని  చేసినా, నీ అవినీతి సొమ్మును కక్కించే దాకా వదలం. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ  లెక్క దేశం వదిలి పారిపోదామనుకుంటున్నావేమో.. దొంగ పాస్ పోర్టులు నీకు అలవాటే.. అయినా నీ ఆటలు సాగవు. నిన్ను రాష్ట్రం వదలి పోనియ్యం.. జైల్లో పెట్టుడు ఖాయం” అని సంజయ్ హెచ్చరించారు.
 
 ‘‘ఢిల్లీ కోటలు బద్దలు కొడ్తడట. కేసీఆర్.. నువ్వు ఏమైనా తీస్ మార్ ఖాన్ వా? ప్రధాని మోదీని చూస్తేనే వంగి వంగి దండాలు పెడ్తవ్.. ఇలాంటి మాటలు మాట్లాడానికి సిగ్గుండాలి. ఢిల్లీ కోట కాదు.. ముందు నీ కుటుంబ కోట బద్దలు కాకుండా చూసుకో” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  
 
జనగామ సభలో ప్రధాని మోదీపై ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీని టార్గెట్ చేయడానికే సీఎం సభ పెట్టినట్లుందని సంజయ్ చెప్పారు. బీజేపీని కేసీఆర్ ఏమీ చేయలేడని స్పష్టం చేశారు. “మాది ప్రపంచంలోనే నంబర్ వన్ పార్టీ. మాతో పెట్టుకుంటే మాడి మసైపోతవ్.. జాగ్రత్త. మమ్మల్ని నశం చేస్తావా.. మేం జండూబామ్ పెడ్తం” అంటూ హెచ్చరించారు.
రాజ్యాంగంపై, ప్రధానిపై కామెంట్లు చేసిన, తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడిన సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బోర్లకు కరెంట్ మీటర్లు పెడతామని కేంద్రం చెప్పిందా? దమ్ముంటే నిరూపించు అని సవాల్ విసిరారు.

కాగా, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య చీకటి ఒప్పందాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సంజయ్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ శనివారం భువనగిరి సభలో కాంగ్రె్‌సకు, రాహుల్‌ గాంధీకి అనుకూలంగా మాట్లాడిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆయన  ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు ఇరు పార్టీలు లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని ఆరోపించారు. 
 
 ప్రధానిపై కేసీఆర్‌ చేసిన అవినీతి ఆరోపణలను ఖండిస్తూ జిల్లా కేంద్రాల్లో ఆదివారం మీడియా, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు.