బీజేపీ ఉడిపి ఎమ్యెల్యే, మైనారిటీ మోర్చా నేతలకు బెదిరింపు కాల్స్ 

హిజాబ్ ధరించి ఉడుపి కాలేజీకి వచ్చిన ఆరుగురు విద్యార్థినులను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించిన ఉడుపి బిజెపి నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి.  ఉడుపి బిజెపి ఎంఎల్‌ఏ కె. రఘుపతి భట్ ,  మైనారిటీ మోర్చా అధ్యక్షుడు దావూద్ అబూబకర్‌‌  ఆ విధంగా  బెదిరింపు కాల్స్ అందుకున్నవారిలో ఉన్నారు. 
కర్నాటకలో హిజాబ్ వివాదం తలెత్తిన ఉడుపిలోని ప్రీయూనివర్శిటీ మహిళా కళాశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా ఉన్న భట్ శుక్రవారం ఉడుపిలో విలేకరులతో మాట్లాడుతూ, తనకు వచ్చిన కాల్స్ చాలా వరకు విదేశాల నుంచి వచ్చిన ఇంటర్నెట్ కాల్స్ అని తెలిపారు. తనకు కాల్ చేసిన వ్యక్తులు ప్రాణాలు తీస్తామని బెదిరించారని, ఇది తనకు కొత్తేమి కాదని ఆ బిజెపి ఎంఎల్‌ఏ అన్నారు. హిజాబ్ విషయంలో మరింత గట్టిగా మాట్లాడితే టార్గెట్ చేస్తామని కూడా వారు హెచ్చరించారన్నారు.

స్థానిక నంబర్ల నుంచి కూడా తనకు అనేక కాల్స్ వచ్చాయని, ఈ పరిణామాన్ని రాష్ట్ర హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్రకు తెలియజేశానని భట్ తెలిపారు. తాను గతంలో కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ చాలానే ఎదుర్కొన్నానని, ఈ పరిణామానికి భయపడేది లేదని ఆయన అన్నారు. ఉడుపిలని ముస్లింలు తన వెంటే ఉన్నారని, జిల్లాలోని ఖాజీలు కూడీ ఈ విషయంలో తనకు మద్దతుగా నిలిచారని ఆయన తెలిపారు.

ఉడుపి పియూ కళాశాల తరగతి గదిలోకి హిజాబ్‌తో అనుమతించాలని పట్టుబట్టే ఆరుగురు బాలికలను కొన్ని శక్తులు తప్పుదారి పట్టించాయని భట్ పునరుద్ఘాటించారు. ఫోన్, వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చినప్పటికీ తాను కేవలం కాలేజిలో యూనిఫాం, క్రమశిక్షణ గురించి మాత్రమే మాట్లాడానని థెయ్ల్పారు.

కాగా, కర్ణాటకలో నెలకొన్న హిజాబ్ వివాదంపై అబూబకర్ స్పందిస్తూ  హిజాబ్‌ ధరించి వచ్చిన అమ్మాయిలను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని, అధికారులు కనుక పట్టుబడితే తరగతి గదిలో హిజాబ్ తీసేసినా పర్వాలేదని వ్యాఖ్యానించిన అబూబకర్‌పై పలువురు మండిపడ్డారు.  ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే రఘుపతి భట్‌ను కలిసి అబూబకర్ తనకు, తన కుటుంబానికి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నట్టు తెలిపారు.  బెదిరింపు కాల్స్ విషయమై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవంక, కర్ణాటకలోని కొన్ని విద్యా సంస్థలు హిజాబ్‌ను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ అలీగఢ్ ముస్లి యూనివర్సిటీకి చెందిన విద్యార్థినులు ఆందోళన సందర్భంగా  హిజాబ్‌ను  తాకేందుకు ప్రయత్నించే చేతులను తెగనరుకుతానిసమాజ్‌వాదీ పార్టీ నేత రుబీనా ఖానం హెచ్చరించారు.
భారతదేశ అక్కచెల్లెళ్లు, కుమార్తెల ఆత్మగౌరవంతో ఆడుకోవాలని ప్రయత్నిస్తే వారు ఝాన్సీ రాణి, రజియా సుల్తానాల్లా మారి హిజాబ్‌ను తాకే వారి చేతులను తెగ నరకడానికి ఎంతో సమయం పట్టదని ఆమె స్పష్టం చేశారు. 
ఇలా ఉండగా, కర్ణాటకలో హిజాబ్ వివాదం హింసాత్మక ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో కాలేజీలు, యూనివర్సిటీలకు సెలవులను ఫిబ్రవరి16 వరకు రాష్ట్ర ప్రభుత్వం  పొడిగించింది. రాష్ట్రంలో తిరిగి శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అందరూ సహకరించాలని విద్యాశాఖ మంత్రి అశ్వత్ నారాయణ కోరారు. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని, ఆన్‌లైన్ తరగతులు యధావిధిగా కొనసాగించాలని ఆదేశించారు. 

ప్రీ-యూనివర్శిటీ, డిగ్రీ కాలేజీల పునఃప్రారంభంపై ఫిబ్రవరి14న నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే  హిజాబ్ అల్లర్ల నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలకు  మూడు రోజులు సెలవులు ఇచ్చింది. సోమవారం నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి క్లాసులు తిరిగి ప్రారంభం అవుతాయని ప్రకటించింది.