ప్రధాని మోదీపై అనర్హత పిటిషన్ కొట్టివేత

ఎన్నికల నియమావళిని ప్రధాని నరేంద్ర మోదీ ఉల్లంఘించారని, ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఎన్నికల ప్రసంగంలో ప్రధాని హిందూ దేవతలతో పాటు ప్రార్థనా స్థలాల  పేర్లు చెప్పి బీజేపీకి ఓట్లు అడిగారని పిటిషనర్‌ ఆరోపించారు. 

ప్రధాని మోదీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని న్యాయవాది ఆనంద్ ఎస్ జోంధాలే ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రధాని మోదీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆరేళ్ల పాటు అనర్హత వేటు వేయాలని పిటిషనర్‌ డిమాండ్‌ చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 

పిటిషన్‌ పూర్తిగా అసంబద్ధమని.. ఏదైనా ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించలేమని పేర్కొంది. ఈసీ తరఫు న్యాయవాది సిద్ధాంత్ కుమార్ పిటిషన్‌ను వ్యతిరేకించారు. ఎన్నికల కమిషన్‌కు ప్రతిరోజూ ఇలాంటి దరఖాస్తులు వస్తున్నాయని, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగ సంస్థ అని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 9న పిలిభిత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీలో పాల్గొని రామమందిరాన్ని నిర్మించినట్లు చెప్పారని, కర్తాపూర్ సాహిబ్ కారిడార్ సైతం అభివృద్ధి చేసినట్లుగా పిటిషనర్‌ ఆరోపించారు. 

గురుద్వారాలలో వడ్డించే లంగర్‌లో ఉపయోగించిన వస్తువులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యలు రెండు కులాలు, వర్గాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేశామని.. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని జోంధాలే ఆరోపించారు.