సీఎం విధులకు ఎవరైనా అంతకాలం దూరంగా ఉండొచ్చా?

ముఖ్యమంత్రిగా కొనసాగాలా వద్దా అనే నిర్ణయం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగతమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. కానీ ఆయన అందుబాటులో లేకపోవడం, ఢిల్లీ మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం వంటివి అందుకోవడానికి అడ్డుకారాదని తేల్చి చెప్పింది.  దానర్థం పిల్లల ప్రాథమిక హక్కులను కాలరాయడం కాదని మండిపడింది.

ఎమ్సీడీ పాఠశాలల విద్యార్థులు వారి రాజ్యాంగ, చట్టబద్ధమైన హక్కులకు అనుగుణంగా ఉచిత పుస్తకాలు, రైటింగ్ మెటీరియల్, యూనిఫాం పొందేందుకు అర్హులని కోర్టు పేర్కొంది.  వేసవి సెలవులకు పాఠశాలలు మూసివేయనున్నందున, రూ.5 కోట్ల పరిమితితో పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఎమ్సీడీ కమిషనర్ను కోర్టు ఆదేశించింది. పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సరఫరా చేయకపోవడంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఈ అంశంపై తాత్కాలిక ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ పీఎస్ అరోరా సోమవారం విచారణ జరిపారు. ‘జాతీయ, ప్రజాప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఏ వ్యక్తి కూడా చాలా కాలం పాటు అజ్ఞాతంలో ఉండకూడదు లేదా గైర్హాజరు కాకూడదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పుడు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోలేమని చెప్పడం తప్పు’ అని ధర్మాసనం పేర్కొంది. 

ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి పదవి అలంకారప్రాయం కాదని కోర్టు తెలిపింది. వరదలు, అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు వంటి ఏవైనా సంక్షోభాల్ని ఎదుర్కోవడానికి పదవిలో ఉన్న వ్యక్తి 24*7 అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది.

కాగా, మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లకుండా నేరుగా సర్వోన్నత న్యాయస్థానానికి ఎందుకు వచ్చారని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. 

ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు నివేదించారు. ఆప్ అధినేతను ‘అక్రమంగా అరెస్టు’ చేయడం కూడా వాటిలో ఒకటని వివరించారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టులో మంగళవారం వాదనలు కొనసాగనున్నాయి. 2021-22కు మద్యం పాలసీ రూపకల్పనలో అవినీతి, మనీలాండరింగ్ జరిగాయన్న కేసులో అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ మార్చి 21న అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నారు.