ముగిసిన మొదటి దశ పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

మొదటి దశ పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. దీంతో శుక్రవారం పార్లమెంట్‌ ఉభయ సభలు మార్చి 14 నాటికి వాయిదా పడ్డాయి. జనవరి 31న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంతో ప్రారంభమైన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తొలి దశ శుక్రవారంతో ముగిసింది. 
 
గత నెల 31న లోక్‌సభ, రాజ్యసభల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను, ఈ నెల 1న 2022-23 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైన, బడ్జెట్‌ పైన ఉభయ సభల్లో చర్చ జరిగింది. ఉభయ సభల్లో ఎటువంటి అంతరాయాలు జరగలేదు. 
 
రాజ్యసభలో నిర్ణీత షెడ్యూల్‌ కంటే అర గంట సేపు ఎక్కువే సభా కార్యకలాపాలు జరిగాయి. రాజ్యసభలో 51 స్టార్‌ ప్రశులు, 50 ప్రత్యేక ప్రస్తావనలు, 70 జీరో అవర్‌ అంశాలు లేవనెత్తినట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ తెలిపారు. అనంతరం సభను మార్చి 14 నాటికి వాయిదావేశారు.

”బడ్జెట్‌ సెషన్‌ మొదటి దశలో సభ్యులందరూ చురుగ్గా పాల్గొని, సానుకూల సహకారం అందించారు. కరోనా సవాళ్లు ఉన్నప్పటికీ సభ్యులు తమ రాజ్యాంగపరమైన బాధ్యతలను నిబద్ధతతో సభలో అర్థరాత్రి వరకు పనిచేయడం ద్వారా నెరవేర్చారు. తద్వారా సభా నిర్వహణ 121 శాతం అధిక ఉత్పాదకతను సాధించగలిగాం” అనిలోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. 
 
సభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు కేటాయించిన 12 గంటలకు బదులు 15 గంటల 13 నిమిషాల పాటు చర్చ జరగ్గా, అందులో 60 మంది సభ్యులు పాల్గొన్నారు. మరో 60 మంది సభ్యులు తమ ప్రసంగాలను సభ టేబుల్‌పై ఉంచారు. 
 
సాధారణ బడ్జెట్‌పై చర్చకు కేటాయించిన 12 గంటల బదులు, మొత్తం 15 గంటల 33 నిమిషాల చర్చ జరిగింది. ఇందులో 81 మంది సభ్యులు పాల్గొన్నారు. 63 మంది ఇతర సభ్యులు తమ ప్రసంగాలను టేబుల్‌పై ఉంచారు.

కాగా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ కేరళ, పశ్చిమ బెంగాల్‌, జమ్ముకాశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రతిపక్షాలు లోక్‌సభలో వాకౌట్‌ చేశాయి. కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ, డిఎంకె, ఆర్‌ఎస్‌పి, టిఎంసి తదితర పార్టీలు వాకౌట్‌ చేశాయి. యోగి ఆదిత్యనాధ్‌ చేసిన ప్రకటనపై సిపిఎం ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌ రాజ్యసభలో రూల్‌ 267 కింద ఇచ్చిన బిజినెస్‌ నోటీసును సస్పెండ్‌ చేశారు.