ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌర స్మృతి… బిజెపి హామీ 

మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి  రూపొందించి, అమలు చేస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత పుష్కర్ సింగ్ ధామి హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 14న జరిగే శాసన సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రచారం చేస్తున్న ధామి శనివారం మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే యూసీసీ ముసాయిదాను రూపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

ప్రస్తుతం ఈ అంశాలకు సంబంధించిన చట్టాలు ఒక్కొక్క మతానికి ఒక్కొక్క విధంగా ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లి, విడాకులు, ఆస్తి వారసత్వం వంటివాటి విషయంలో అందరినీ సమానంగా పరిగణించేందుకు యూసీసీ దోహదపడుతుంది.  ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, తాము ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే యూసీసీ ముసాయిదాను తయారు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చెప్పారు.
రాజ్యాంగ నిర్మాతల కలలు సాకారమవడానికి యూసీసీ దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. అందరి కోసం యూసీసీని అమలు చేయాలని భారత రాజ్యాంగంలోని అధికరణ 44 చెప్తోందని గుర్తు చేశారు.
కాగా, యూసీసీపై పుష్కర్ సింగ్ ధామి ఇచ్చిన హామీని బీజేపీ నేత అమిత్ మాలవీయ స్వాగతించారు. బీజేపీ పరిపాలనలో ఉన్న గోవా తర్వాత యూసీసీని అమలు చేయబోతున్న రెండో రాష్ట్రం ఉత్తరాఖండ్ అవుతుందన్నారు. ముస్లిం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తుండగా, బీజేపీ మాత్రం సమానత్వం, సాధికారత కోసం గళమెత్తుతోందని చెప్పారు.
ఉత్తరాఖండ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 14న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది.